జాఫర్ సాహెబ్ కాలువను మింగేస్తున్నారు

29 Oct, 2013 06:48 IST|Sakshi

సాక్షి, నెల్లూరు:   ప్రధాన సాగునీటి కాలువలు ఆక్రమణల ఉచ్చులో చిక్కుకుంటున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన కరువైంది. ఇదే అదునుగా కొందరు మరింత రెచ్చిపోతూ నడికాలువలోకి నిర్మాణాలను విస్తరించారు. ఈ క్రమంలో కాలువ పూడికకు గురై ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెన్నార్ డెల్టా పరిధిలో జాఫర్‌సాహెబ్ కాలువ ప్రధానమైనది. నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో ప్రవహించే ఈ కాలువ కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో తొలికారు సాగుకు నవంబర్ 1 నుంచి సోమశిల జలాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు కాలువ ఆక్రమణలు ఆందోళన కలిగిస్తున్నాయి.
 
నెల్లూరు నగరంలోని మైపాడురోడ్డును ఆనుకుని ఈ కాలువ ప్రవాహం కొనసాగుతుంది. అయితే పాతచెక్‌పోస్టు, బోడిగాడితోట, శెట్టిగుంటరోడ్డు, వీవర్స్‌కాలనీ, బంగ్లాతోట, నవాబుపేట, కిసాన్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాలువ ఆక్రమణలకు గురైంది. కాలువ స్థలాన్ని రెండువైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో పూడిక పేరుకుపోయింది. కొందరైతే ఏకంగా కాలువలో పిల్లర్లు వేసి భవనాలు నిర్మించారు. విలువైన స్థలం కావడంతో ఆక్రమణదారులు పోటీపడుతున్నారు. వీరివెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల అయితే రైసుమిల్లులు కాలువలోకి చొచ్చుకొచ్చాయి. క్రమేణా కాలువ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తున్నా ఇరిగేషన్ అధికారుల్లో స్పందన కరువైంది. మరోవైపు పూడికతీత పనుల పేరుతో తరచూ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే ఆయకట్టులో చివర పొలాలు బీడుగా మారే ప్రమాదం నెలకొంది.
 
 కాలువలోకి వ్యర్థజలాలు
 జాఫర్‌సాహెచ్ కాలువ ఒడ్డున, సమీపంలో పెద్దసంఖ్యలో రైసుమిల్లులు ఉన్నాయి. వీటన్నంటి నుంచి విడుదలయ్యే వ్యర్థజలాలను కాలువలోకి వదిలేస్తున్నారు. రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి సైతం వ్యర్థ జలాలు ఈ కాలువలో కలుస్తున్నాయి. రసాయనాలతో కూడిన ఈ నీళ్ల కారణంగా ఆయకట్టులోని పొలాలు చవుడుబారుతున్నాయి. ఇప్పటికే కాలువలో పలుజాతుల చేపలు ఉనికి కోల్పోయాయి.  ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి జాఫర్‌సాహెబ్ కాలువ పరిరక్షణకు నడుం బిగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు