జగన్‌ నిర్ణయం.. మహిళలకు వరం!

1 Aug, 2018 12:30 IST|Sakshi
వైఎస్ జగన్‌

మద్యపాన నిషేధం ప్రకటనతో మహిళల్లో హర్షాతిరేకాలు

తాను అధికారంలోకి వస్తే దశలవారీగా తొలగిస్తానన్న జగన్‌

సీఎం హామీ బుట్టదాఖలవడంపై   పెల్లుబుకుతున్న నిరసన

విజయనగరం రూరల్‌ : అధికారంలోకి వచ్చిన తరువాత దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానంటూ సంచలన ప్రకటన చేసిన వైఎస్సార్‌సీపీ అధి నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన లక్షలాది మహిళల్లో మనోధైర్యాన్ని నింపింది. 2014 ఎన్నికల్లో బెల్టు దుకాణాల నిషేధిస్తామం టూ గొప్పగా ప్రకటించి... సీఎంగా ప్రమాణ స్వీకారంనాడు తొలిసంతకం చేసినా... అమలు చేయడంలో విఫలమయ్యారు. ఆదాయమే పరమావధిగా మద్యం అమ్మకాలను మరింత విస్తృతపరచి... బెల్టు షాపులకు ఊతమిచ్చారు. 

పెరిగిన మద్యం దుకాణాలు

2014కు ముందు జిల్లాలో 200 మద్యం దుకాణా లు ఉంటే ప్రస్తుతం మరో పది పెరిగాయి. 2014కు ముందు కనీసం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల్లో అమ్మకాలు జరిగితే 2018 సంవత్సరం నాటికి వెయ్యి కోట్ల మార్కుకు చేరువలో అమ్మకాలు సాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రాష్ట్ర, జాతీయ రహదారులకు 220 నుంచి 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు నిర్వహించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసినా... ఆదాయమే పరమావధిగా భా వించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రహదారులను జిల్లా రహదారులుగా మార్చేసి రోడ్డు పక్క మ ద్యం విక్రయాలకు ఏ ఇబ్బంది లేకుండా చేసేంది. దీంతో మద్యం సేవించి వాహనాలు నడ పడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 

జననేత ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం

గతేడాది ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో దశలవారీ మద్యపాన నిషేధ ప్రకటన చేయడంతో ఉలిక్కిపడ్డ సీఎం 2017 జూలై 19న బెల్టు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటా మని హడావుడి ప్రకటన చేశారు. ఆయన ఆదేశాలతో నెలరోజులపాటు హడావుడి చేసిన ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖకు ‘ముఖ్య’నేతల అనధికార ఆదేశాలతో వాటికి జోలికి వెళ్లలేదన్న విమర్శలు మహిళల నుంచి వినిపిస్తున్నాయి. కానీ బెల్టు షాపుల దందా మాత్రం ఇంకా బాహాటంగానే కొనసాగుతోంది.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

2014 ఎన్నికల్లో బెల్టు దుకాణాలు నిషేధిస్తూ తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు బెల్టు దుకాణాల నిషేధానికి తీ సుకున్న చర్యలు శూ న్యం. ప్రతీ గ్రామానికి రెండు, మూడు బెల్టు దుకాణాలున్నాయి. చిన్నచితకా కూలిపని చేసే వారు వారి రోజువారీ వేతనాన్ని మద్యానికే తగలేస్తూ కుటుంబాలను పట్టించుకోవడం లేదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జగన్‌మోహన్‌రెడ్డి మద్యనిషేదం ప్రకటన హర్షణీయం.   – బి.రమణమ్మ, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి

సంపాదనంతా మద్యానికే

అల్పాదాయ వర్గాల్లో అనేకమంది సంపాదనంతా మద్యానికే తగలేయడంతో వారి కుటుంబా లు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అందువల్ల మహిళలే కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది. వారి పిల్లలు చదువును మధ్యలోనే ఆపేసి కూలీలుగా మారుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మద్యపాన నిషేధ ప్రకటనతో చంద్రబాబులో గుబులు రేగుతోంది. చంద్రబాబు మద్య నియంత్రణ ప్రకటన ఉత్తుత్తిదేనని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలు బుద్ధి చెప్పడం ఖాయం.

– పాలూరి రమణమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు

జగన్‌ ప్రకటన హర్షణీయం

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి మద్య నిషేధంపై ప్రకటన చేయడం హర్షణీయం. మద్యంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల్లో మరణించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యువత మద్యం సేవించి మైనర్‌ బాలికలు, యువతపై అత్యాచారాలకు పాల్పడటం ఆందోళనకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలు ఆగాలంటే మద్యపానాన్ని నిషేదించాలి.

– ఎం.మాణిక్యం, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు 

మరిన్ని వార్తలు