పెద్దాపురం జగన్నినాదం

2 Apr, 2019 09:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మండుటెండలో పెద్దాపురం జనసంద్రమైంది. జగన్నినాదం మిన్నంటింది. అభిమాన కెరటం ఎగసిపడింది. యువత ఉత్సాహం ఉరకలెత్తింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక సందర్భంగా వెల్లువలా తరలివచ్చిన జనంతో పట్టణం కిటకిటలాడిపోయింది. తమ ప్రియనేతను చూసేందుకు మండుటెండను సహితం లెక్క చేయకుండా తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దాపురం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. హెలిప్యాడ్‌ వద్దకు వేలాదిగా చేరుకున్న జనంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. అక్కడి నుంచి బహిరంగ సభ వద్దకు ప్రజలు తమ అభిమాన నేతను తోడ్కొని తీసుకువెళ్లారు.

ఆ సమయంలో ఆ ప్రాంతమంతా జగనిన్నాదాలతో, మోటార్‌ బైక్‌ ర్యాలీలతో హోరెత్తిపోయింది. నియోజకవర్గం నలుమూలల నుంచీ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావడంతో పెద్దాపురం పట్టణమంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండాలతో సందడిసందడిగా మారింది. ఓవైపు ఎండ తీవ్రత ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నా జగన్‌ను చూసేందుకు వృద్ధులు, మహిళలు, యువకులు ఎంతో ఆత్రంగా వేచి ఉన్నారు. జగన్‌ సభావేదిక వద్దకు చేరుకోగానే మరోసారి జగన్నినాదంతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. ‘సీఎం సీఎం’ ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ జగన్‌ మాట్లాడిన తీరుకు ప్రజలు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక అంశాలను కూడా జగన్‌ ప్రస్తావించడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.

జగన్‌ మాట్లాడుతూ, టీవీల్లో చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నమ్మితే.. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మినట్టేనని, ఆయన మాటలు నమ్మి మరోసారి మోసపోరాదని కోరారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టగా, చంద్రబాబు హయాంలో అవి నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రాజెక్టును పూర్తిగా అవినీతిమయం చేసిన ఆయన, బినామీలు, సబ్‌ కాంట్రాక్టుల పేరుతో మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి అప్పగించి, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని, ప్రాజెక్టు పూర్తి చేసిన దాఖలాలు లేవని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటికే సుమారు 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, ఆయనకు మరోసారి పొరపాటున ఓటు వేస్తే ప్రభుత్వ పాఠశాలలనేవే ఉండవని, వాటి స్థానంలో ‘నారాయణ’ పాఠశాలలు వస్తాయని చెప్పారు.

ప్రస్తుతం ఎల్‌కేజీకి రూ.25 వేల ఫీజు వసూలు చేస్తున్నారని, మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వసూలు చేస్తారని అన్నారు. అన్నదాత కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఒకవైపు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,750 అని చెబుతూ క్వింటాల్‌కు రూ.1,200 కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో టన్ను చెరకు గిట్టుబాటు ధర రూ.3,115 ఉంటే పెద్దాపురం నియోజకవర్గంలో రూ.2,600కు మించి ఇవ్వడం లేదని జగన్‌ అన్నారు.


జగన్‌ రాకతో పెరిగిన జోష్‌
ఇప్పటికే మంచి ఉత్సాహంతో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జగన్‌ సభ మరింత జోష్‌ను నింపింది. నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ చేరిక, అనేకమంది టీడీపీ ప్రముఖులు, కౌన్సిలర్లు ఇప్పటికే తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరడంతో బలం పుంజుకున్న వైఎస్సార్‌ సీపీకి ఇప్పుడు జగన్‌ సభకు పోటెత్తిన జనప్రవాహం మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. 

మరిన్ని వార్తలు