అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్‌

26 Mar, 2019 10:00 IST|Sakshi

శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్‌:  జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులతోపాటు నిరుద్యోగుల్లో ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కర్నూలు జిల్లా ఆదోని ఎన్నికల సభలో చేసిన ప్రకటన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 12 వేల మంది ఉపాధ్యాయులు, 30 వేల మంది ఉద్యోగులున్నారు. వీరు పీఆర్‌సీ కోసం పోరాటం చేయగా సుమారు ఏడాది జాప్యం చేసి ఇటీవలనే 22 శాతం ఐఆర్‌ను చంద్రబాబు ప్రకటించారు. దీనిని తక్షణం అమలు చేయకపోగా మే నెల నుంచి అమలు చేస్తామని చెప్పడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు, పెన్షనర్లు చంద్రబాబు మోసపూరిత ప్రకటనను గ్రహించారు. మూడు విడతల డీఏ బకాయి ఉండగా ఒక డీఏను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా అది సైతం ఎన్నికల తర్వాతనే అమలయ్యేటట్లు ఉత్తర్వులు విడుదల కావడంతో ఆయా వర్గాలు ఖంగుతిన్నాయి.

దీనిపై ప్రతిపక్షనేత సోమవారం ఆదోనిలోని ఎన్నికల సభలో మాట్లాడుతూ తాను అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్‌ను ఇస్తామని చెప్పడం పట్ల ఉద్యోగ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. సకాలంలో పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి అమలు చేస్తామని చెప్పడం కూడా ఆ వర్గంలో ఆనందాన్నిచ్చింది. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించడం సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో సంతోషాన్ని నింపింది. ఎప్పటి నుంచో సీపీఎస రద్దు కోసం పోరాటం చేస్తుండగా దానిని అమలు చేయకపోగా ఆందోళనను అణగదోక్కే ప్రయత్నాన్ని చంద్రబాబు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన వల్ల జిల్లాలో 8,900 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇస్తామని చెప్పడం పోలీసు ఉద్యోగ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నా ఆయా వర్గాలు దీనిని బహిర్గతం చేయలేకపోతున్నాయి.

గత ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రెగ్యులరైజ్‌ చేస్తామని చంద్రబాబు హామీలిచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయకపోగా ఎందరో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇంటిదారి పట్టించారు. దీనిపై కూడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చేస్తూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రెగ్యులరైజ్‌ చేయడంతోపాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రకటించడంతో దీనిని ఆయా ఉద్యోగ వర్గాలు విశ్వసిస్తున్నాయి. దీని వల్ల జిల్లాలో సుమారు 20వేల మంది లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల వేలాదిమంది నిరుద్యోగ యువకులు ప్రయోజనం పొందే పరిస్థితి ఉంది. పెన్షనర్లకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించడం వల్ల జిల్లాలో ఉన్న 20 వేల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


అత్యధిక ఐఆర్‌గా నమోదు  
ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించి న 27శాతం ఐఆర్‌ ఇప్పటి వరకు ప్రకటించిన ఐఆర్‌లలో  అత్యధికమవుతుంది. ఈ ప్రకటన అభినందనీయం. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు లబ్ధి  పొందుతారు.
   –పాలక పురుషొత్తం, గిరిజన ఉపాధ్యాయ విభాగం నాయకుడు, శ్రీకాకుళం


ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటన మంచిదే
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ 27 శాతం పెంచుతున్నట్లు వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటనను ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల ఉద్యోగులకు కొంత మేలు జరుగుతుంది. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఆర్థిక వెసులబాటు ఉంటుంది. ఉద్యోగులందరూ వైఎస్‌ జగన్‌ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  
– ఎస్‌.ప్రభాకరరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నరసన్నపేట 


సుప్రీం తీర్పుకు న్యాయం జరుగుతుంది
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నేడు జగన్‌ చేసిన ప్రకటనతో న్యాయం జరుగుతుంది. ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనలో ఎనలేని కషిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులర్‌ చేస్తామని జగన్‌ చేసిన ప్రకటన హర్షణీయం. 
– టి.బాలమురళీకృష్ణ, కాంట్రాక్ట్‌ అధ్యాపకుడు, వీరఘట్టం

చాలా మంచి పరిణామం..
ఉద్యోగులుకు 27 శాతం ఐఆర్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం ఆనందదాయకం.  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. 2019 జనవరి 1 నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. ఉద్యోగులు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. 
– గడే అప్పలనాయుడు, సీపీఎస్‌ ఉద్యోగి, రాజాం


ఎంతో ఆనందం కలిగించింది
ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పోలీసులకు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి మేలు కలిగేలా జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఎంతో ఆనందం కలిగించింది. ఐఆర్‌ 27 శాతం ఇస్తామనే ప్రకటనతో రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగస్తులకు లబ్ధి కలుగుతుంది. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని చేసిన పోరాటాలకు గత ప్రభుత్వం కనీసం స్పందించలేదు.
–బి.బాలకృష్ణ, ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి


జగన్‌ హామీని స్వాగతిస్తున్నాం 
ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు తాను అధికారంలోకి రాగా చర్యలు చేపడతామన్న జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఉద్యోగ సంఘాల తరఫున స్వాగతిస్తున్నాం. సీపీఎస్‌ రద్దు చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారని, ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఏంటో అర్థమవుతుంది. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేయడం ఆనందంగా ఉంది.
– ఎం.చినబాబు, ఉపాధ్యాయుడు, పాతటెక్కలి, వజ్రపుకొత్తూరు 

మరిన్ని వార్తలు