జయహో జగన్‌

24 May, 2019 14:20 IST|Sakshi

సాక్షి , ఒంగోలు : అంతటా జయజయ ధ్వానాలు..జన హృదయ విజేత రాష్ట్రాధినేత కావాలన్న సంకల్పం ప్రభంజనమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి జనం పట్టం కట్టారు. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమ గీతం పాడుతూ సంక్షేమ రాజ్యాన్ని కాంక్షిస్తూ విజయ ఢంకాలు మోగించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించగా..మిగిలిన నాలుగు చోట్ల టీడీపీ గెలుపొందింది. ఒంగోలు ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకుంది. బాపట్ల, నెల్లూరు పార్లమెంట్‌ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులే జయ కేతనం ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో విజయోత్సాహం మిన్నంటింది. స్వీట్లు పంచుతూ, రంగులు చల్లుకుంటూ, బాణసంచాలు కాల్చుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నేను ఉన్నాను..నేను విన్నాను..అని జగన్‌ అన్న మాటకు ప్రతిగా జిల్లా ప్రజలు నీకు మేమున్నాము అంటూ ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్‌ సీపీకి చారిత్రాత్మక విజయం అందించారు.

జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలితో హోరెత్తింది. అన్ని వర్గాల ప్రజలు సైకిల్‌కు పంచరేసి వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్న లక్ష్యంతో ప్రభంజనంలా ఫ్యాను గుర్తుకు  ఓట్లేశారు. దీంతో జిల్లాలోని ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గెలిచిన అందరు అభ్యర్థులకు 20 వేల నుంచి 80 వేల వరకు భారీ మెజార్టీ దక్కడం గమనార్హం. టీడీపీ జిల్లాలో కుప్ప కూలింది. అద్దంకి, చీరాల, కొండపి, పర్చూరు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌పై 22,245 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గిద్దలూరు నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు జిల్లాలో అత్యధికంగా 80,142 ఓట్లకుపైగా మెజార్టీతో ముత్తముల అశోక్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. యర్రగొండపాలెం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌ టీడీపీ అభ్యర్థి అజితారావుపై 31,096 ఓట్ల  మెజార్టీతో  గెలుపొందారు.

కనిగిరిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై 40,668 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మార్కాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై 18,667 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దర్శి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌ టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావుపై 39,057  ఓట్ల ఆ«ధిక్యంతో ఘన విజయం సాధించారు.  సంతనూతలపాడు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి టీజేఆర్‌ సుధాకర్‌బాబు తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బీఎన్‌ విజయ్‌కుమార్‌ పై 9080 ఓట్లతో గెలుపొందారు. కందుకూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి పోతుల రామారావుపై 14,637 ఓట్లకుపైగా ఆధిక్యంతో విజయం సాధించారు. పర్చూరు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కన్నా 1295 ఓట్లు వెనుకబడి ఉన్నారు. కొండపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ వెంకయ్యపై టీడీపీ అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి 1095 స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు.   వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అందరూ 20 నుంచి 80 వేల భారీ మెజార్టీలతో భారీ విజయం సాధించారు.

 అన్ని వర్గాల ప్రజలు ఫ్యాను గుర్తుకే ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఇక జిల్లాలో గత ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో  అదనంగా ఒక స్థానాన్ని కోల్పోయి కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై 17,801 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బాచిన చెంచుగరటయ్యపై 12,747 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో పరాభవం పొందారు. మాగుంట శిద్దా రాఘవరావుపై 2,12,522 పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు స్థా«నాన్ని గెలుచుకున్న టీడీపీకీ ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. బాపట్ల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాం మాల్యాద్రిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నందిగం సురేష్‌  15,881 ఓట్ల ఆధిక్యత సాధించారు. 
జిల్లా వ్యాప్తంగా సంబరాలు:
వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారని సమాచారం అందుకున్న పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు కౌంటింగ్‌ నిర్వహిస్తున్న ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా  పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణ సంచా పేల్చడంతో పాటు రంగులు చల్లుకొని, కేక్‌లు కట్‌చేసి పంచిపెట్టారు. అభ్యర్థుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు.

మరిన్ని వార్తలు