రైతుకు జగన్‌ భరోసా..

23 Mar, 2019 10:10 IST|Sakshi
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో రైతులతో కలిసి నడుస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (ఫైల్‌)

మట్టి తల్లినే నమ్ముకున్నారు వారంతా. రేయింబవళ్లు ఆ తల్లి ఒడిలోనే కాలం గడుపుతారు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని వారంతా కరాల సత్తువ..నరాల బిగువుతో స్వేదం చిందించి..ఆరుగాలం ఇంటిల్లిపాది కష్టపడి   పంటలు సాగుచేస్తే..అతివృష్టి, లేకపోతే అనావృష్టి కారణంగా వారి శ్రమ   మట్టిలో కలిసిపోతోంది. అన్నీ బాగుండి పంట చేతికొచ్చినా సరైన మద్దతు ధర లభించకపోవడంతో పెట్టుబడికి కూడా నోచుకోలేకపోతున్నారు. దీంతో రైతులు  పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లోను, వ్యాపారుల దగ్గర తెచ్చే రుణాలకు వడ్డీలు పేరుకుపోయి తడిసిమోపెడవుతున్నాయి. ఎవరో వస్తారని..ఏదో చేస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అన్నదాతలు  విసిగి వేశారిపోయారు. అంతలో అన్నదాత దీనస్థితిని ఆకళింపు చేసుకుని..రైతులకు భరోసా కల్పించాలని భావించి నేనున్నానంటూ ముందుకు వచ్చారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. రైతుకు భరోసా కల్పిస్తానని ధైర్యం చెబుతూ రైతు భరోసా పేరిట అన్నదాతలను ఎలా ఆదుకుంటామో తెలియజేస్తూ వారికి కొండంత మనోస్థైర్యాన్ని కల్పించారు.  


సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే తినడానికి తిండి లేదు. జీవనం లేదు. ప్రజలందరికీ  అన్నం పెట్టే రైతులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న రైతులు ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులకు వ్యవసాయం చేయడం సమస్యగా మారింది. గతి లేక వ్యవసాయం చేస్తే, చివరిలో విపత్తు వస్తే, ఆ ఏడాది పంట తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని  పునరుద్ధరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు.

ఈ మేరకు రైతాంగానికి, వ్యయసాయ రంగానికి మేలు చేసేందుకు ముందుకువచ్చారు.  తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో  ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం చెబుతున్నారు.  ఈ హామీతో సగటు రైతుకు ఏడాదిలో కనీసం ఒక రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.12,500 ఆర్థిక సాయం, ఉచిత బోరు, ఉచిత విద్యుత్, రోడ్‌ ట్యాక్స్, సున్నా వడ్డీ వంటి సేవలతో రైతులకు ప్రతి ఏటా ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీతో ప్రతి రైతు  ధైర్యంగా వ్యయసాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. గతంలో రైతులు పంటలకు భద్రత లేక, పెట్టుబడికి భరోసా లేక వ్యయసాయాన్ని విడిచి, ఇతర పనులు, ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకండా  విద్యుత్‌ సరఫరా కోసం పొలంలో పడిగాపులు కాసిన సందర్భాలు కోకొల్లలు. పంటలు వేసే సమయంలో పెట్టుబడి లేక, అప్పు దొరక్క అవస్థలు పడిన పరిస్థితులు అధికం. తీరా బ్యాంకు నుంచి రుణం పొందినా,  ప్రతిఏటా వడ్డీ కట్టలేని పరిస్థితి. రైతులకు ఎప్పటికప్పుడు అప్పు కావాలంటే దొరికే పరిస్థితి  కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రతిపక్షనేత, వైస్సార్‌సీపీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల కోసం రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో భాగంగా రైతాంగాన్ని ఆదుకోవడం సంతోషమంటూ రైతులు సంబరపడుతున్నారు. 


వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ఇలా.. 

  • ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తాం. ఆ మొత్తాన్ని మే నెలలో  పెట్టుబడి కోసం రూ.12,500 చొప్పున నాలుగేళ్లు చెల్లిస్తాం. రెండవ సంవత్సరం నుంచి, రైతన్నకు వడ్డీలేని రుణాలు, రైతులకు ఉచిత బోర్లువేయిస్తాం.
  • వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌  ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలు యూనిట్‌కి రూ.1.50  తగ్గింపు
  •  రైతుల కోసం రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి  ఏర్పాటు,రైతులకు రూ.4000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు
  •   ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరం మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు
  •  మొదటి ఏడాది సహకార రంగం  పునరుద్ధరణ   రెండో ఏడాది సహకార డైరీకి  పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 సబ్సిడీ  
  • వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ రద్దు  
  •  దురదృష్టవశాత్తు ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు వైఎస్‌ఆర్‌ బీమా పేరిట ఆ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం.
  • అంతేకాకుండా ఆ డబ్బు అప్పుల వారికి చెందకుండా అసెంబ్లీ తీర్మానం తీసుకువస్తామని నవరత్నాలు పథకంలో పేర్కొన్నారు. 


వైఎస్‌ఆర్‌ బీమాతో ఆర్థిక ఆసరా
మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు వైఎస్‌ఆర్‌ బీమా పేరిట రూ.5 లక్షలు నగదు ఇస్తామని చెప్పడం చూస్తుంటే ఆ రైతు కుటుంబానికి ఆసరా లభించినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు పేద రైతులు చనిపోతే, బాధిత కుటుంబం రోడ్డున పడుతోంది. ఇక నుంచి ఈ పథకంతో రైతుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది రైతు కుటుంబాలకు నిజంగా మంచి ఆసరా.
 –సాధు రామారావు, ఏవీ పేట, గార మండలం

 రైతుకు పెట్టుబడి ప్రకటన ఎంతో మేలు 
ప్రతి రైతుకు ఏటా రూ.12,500 ఇస్తామని, అది కూడా ఖరీఫ్‌ సీజన్‌కు ముందు వ్యవసాయానికి పెట్టుబడికి పనికి వచ్చేలా సకాలంలో అందజేస్తామని, ఇలా ఐదేళ్లలో  ప్రతి రైతుకు రూ. 50 వేలు ఆర్థిక ప్రోత్సాహం సమకూరుస్తామని చెప్పాడం వల్ల రైతుకు చాలా మేలు జరుగుతుంది. దీని వల్ల రైతుకు వ్యవసాయంపై ఆసక్తి కలుగుతుంది.        
   – గోండు రఘురాం, వైఎస్‌ఆర్‌సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు  

వడ్డీలేని రుణంతో ప్రయోజం  
వడ్డీలేని రుణాలను మంజూరు చేయడం వల్ల రైతులు తీసుకున్న అప్పులో అసలు వేగంగా చెల్లించవచ్చు. వడ్డీ పెరిగే ప్రమాదం లేనందున ఏటా అప్పుతీసుకోవడం, సకాలంలో తీర్చుకోవడం కుదురుకుంది.  
–అనుపోజు నాగరాజు, శ్రీకాకుళం 


తీరనున్న సాగునీటి సమస్య  
సాగునీరు అందుబాటులోలేని, వర్షాభావంపై ఆధారపడి ఉన్న భూములలో ఉచితంగా లక్షలాది రూపాయల వ్యయంతో మెట్టు భుముల్లో బోర్లు వేయడం వల్ల పంటలు పండుతాయి. పల్లం, మెట్టు భూముల రైతులకు మేలు చేకూరుతుంది. మూడు పంటలు పండించే అవకాశం ఉంది.
 –యతిరాజుల ప్రసాదరావు, రైతు, శ్రీకాకుళం 


జిల్లాలో రైతుల పరిస్థితి.......
ఏ జిల్లాలో ఉన్న రైతు కుటుంబాల సంఖ్య –6.70 లక్షలు  
ఏ రైతులు ప్రతి ఏటా తీసుకున్న రుణాల మొత్తం రూ. 1,400 కోట్లు  
ఏజిల్లాలో ఉన్న విద్యుత్‌ బోర్లు 11,000  
ఏజిల్లాలో ఆక్వా ప్లాంట్లు   10,000  
ఏజిల్లాలో సహకార సంస్థలు 48  
(ఎన్జీవో–ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ 100)  
ఏ జిల్లాలో వ్యసాయ ట్రాక్టర్లు 7,000  

మరిన్ని వార్తలు