రైతుదీక్షకు తరలిన జనం

2 Feb, 2015 06:15 IST|Sakshi
రైతుదీక్షకు తరలిన జనం

* నియోజకవర్గాల నుంచి  భారీ ర్యాలీగా వెళ్లిన నేతలు
* వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి  జిల్లా ప్రజల సంఘీభావం

సాక్షి, విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు కృష్ణా జిల్లా జనం పోటెత్తారు. రాష్ట్రంలో రైతులను, డ్వాక్రా మహిళలను వంచిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టిన రెండు రోజుల రైతు దీక్ష ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. ఈ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు 16 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
 
అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటి నుంచి తప్పుకొనేందుకు దొడ్డిదారులు వెదుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులు, డ్వాక్రా మహిళలకు మద్దతుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల రైతు దీక్ష పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు రైతులు, మహిళలతోపాటు వివిధ వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. అనుమతి లేదని ఆర్టీసీ అధికారులు బస్సులు కేటాయించకపోయినా అనేక మంది స్వచ్ఛందంగా వాహనాలు సమకూర్చుకుని తణుకు వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించారు.

మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు ఆదివారం ఉదయం భారీ ర్యాలీగా ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. జిల్లా ముఖ్యనేతలు కొందరు శనివారం నుంచే దీక్షలో పాల్గొన్నారు.  ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకాప్రతాప్ అప్పారావు, జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర నేత సామినేని  ఉదయభాను దీక్షలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వారు ధ్వజమెత్తారు.

జిల్లా నుంచి ర్యాలీగా..
గుడివాడ నియోజకవర్గం నుంచి పార్టీ ఉత్తర కృష్ణా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పామర్రు, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, మేకా ప్రతాప్‌అప్పారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు తణుకు వెళ్లారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నేతృత్వంలో ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తణుకు తరలివెళ్లారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో వివిధ నియోజకవర్గాల నుంచి ర్యాలీలుగా దీక్షకు తరలివెళ్లారు.
 
దీక్షలో జిల్లా నేతలు...
పార్టీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసుపార్థసారథి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పేర్ని నాని (మచిలీపట్నం), జోగి రమేష్ (మైలవరం), ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.గౌతంరెడ్డి, మొండితోక జగన్‌మోహన్‌రావు (నందిగామ) సింహాద్రి రమేష్‌బాబు (అవనిగడ్డ), ఉప్పాల రాంప్రసాద్ (పెడన), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), దుట్టా రామచంద్రరావు(గన్నవరం)లతో పాటు జెడ్పీలో పార్టీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, నాయకులు ఉప్పాల రాము, కాజ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు