మహిళలకు అభయాంధ్రప్రదేశ్‌

14 Dec, 2019 03:06 IST|Sakshi
దిశా చట్టం ఆమోదించి మహిళ భద్రతకు అండగా నిలిచినందుకు గాను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ కడుతున్న ఎంపీ గొడ్టేటి మాధవి, వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు వరుదు కళ్యాణి, గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మీ

అసెంబ్లీలో ‘దిశ’ బిల్లుపై చర్చలో హోంమంత్రి సుచరిత  

సాక్షి, అమరావతి : మహిళలు, చిన్న పిల్లలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే అభయాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ బిల్లుకు రూపకల్పన చేశారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టము – మహిళలు, బాలలపై నిర్దేశిత అపరాధాల విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక న్యాయస్థానముల చట్టం–2019’ను ఆమె శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై చర్చను ఆమె ప్రారంభిస్తూ హైదరాబాద్‌లో ‘దిశ’పై జరిగిన దారుణాన్ని తెలుసుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చలించిపోయారన్నారు. అందుకే మహిళల రక్షణకోసమే ప్రత్యేకంగా చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారన్నారు.

‘రాష్ట్రంలో మహిళలకు జగనన్నే రక్ష... వారిపై చేయి వేస్తే తప్పదు కఠిన శిక్ష’ అని పేర్కొన్నారు. మహిళలు, బాలలపై నేరానికి పాల్పడిన వారిని 14 పనిదినాల్లో విచారించి 21 పనిదినాల్లో శిక్ష పడేలా ఈ చట్టాన్ని తేవడమేగాక అందుకోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సోషల్‌ మీడియాలో, ఫోన్‌ ద్వారా మహిళల్ని కించపరిస్తే రెండేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధించేలా 354(ఇ) సెక్షన్‌ తెస్తున్నామని తెలిపారు. ఇదే తప్పును రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు.

354(ఎఫ్‌) సెక్షన్‌ ప్రకారం బాలలపై ఎవరైనా లైంగిక నేరాలకు పాల్పడితే 10 నుంచి 14 ఏళ్ల వరకు గరిష్టంగా శిక్ష పడుతుందన్నారు. 354(జీ) సెక్షన్‌ ద్వారా పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల పట్ల టీచర్లు, వార్డెన్లు కానీ, మహిళా ఖైదీల పట్ల జైలు వార్డెన్లు కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి కఠిన శిక్షలు పడే వీలుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత మహిళను హోంమంత్రిని, గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని, అనేకమంది మహిళలు ఎమ్మెల్యేలయ్యే అవకాశాన్ని జగన్‌  కల్పించారని ఆమె చెప్పారు.

జగన్‌ దేశానికి ‘దిశ’ చూపించారు

కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రులు సుచరిత, వనిత, పుష్ప శ్రీవాణి, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు శ్రీదేవి, కళావతి  

‘దిశ’ చట్టానికి శుక్రవారం అసెంబ్లీ ఆమోదం తెలపడంతో మహిళా మంత్రులు, సభ్యులు మీడియా పాయింట్‌లో కేక్‌ కట్‌ చేసి సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. మహిళల భద్రతకోసం ‘దిశ చట్టం 2019’ని తేవడంద్వారా ముఖ్యమంత్రి దేశానికి దిశ చూపించారని వారీ సందర్భంగా పేర్కొన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ మహిళల రక్షణ పట్ల సీఎంకున్న చిత్తశుద్ధికి ఈ చట్టం నిదర్శనమన్నారు. ఇందుకు రాష్ట్ర మహిళా లోకమంతా రుణపడి ఉంటుందన్నారు. ‘దిశ’ చట్టం తేవడం ద్వారా ఏపీ దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. వచ్చే జనవరిలో దిశ చట్టంపై జాతీయస్థాయిలో మహిళా సదస్సు నిర్వహించడం ద్వారా కేంద్ర చట్టాల్లోనూ మార్పులు తీసుకొచ్చేలా డిక్లరేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పుష్పశ్రీవాణి, తానేటి వనిత, పార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కళావతి పాల్గొన్నారు.  

దశ ‘దిశ’లా హర్షం
మహిళలపై వేధింపులకు చరమగీతం పాడుతూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ‘ఏపీ దిశ యాక్టు–2019’ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మహిళలు, విద్యార్థులు, పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ర్యాలీలు నిర్వహించారు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

తూ.గో జిల్లా సామర్లకోటలో మహిళా సంఘాల ప్రతినిధుల ర్యాలీ   

అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రికి మహిళలంతా ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ అని ఎయిర్‌పోర్టులో ప్లకార్డులతో స్వాగతం పలికారు. ఆయనకు రాఖీ కట్టి, శాలువాతో సన్మానించారు. తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో మహిళలు, విద్యార్థినులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. పొదుపు సంఘాల మహిళలూ ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు. దిశ చట్టాన్ని మహిళలకు కానుకగా ఇచ్చారని అందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు. అనేకచోట్ల కళాశాలల్లో విద్యార్థినులు కేకులు కట్‌చేసుకుని సంబరాలు చేసుకున్నారు.

అనంత జిల్లా రాప్తాడులో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్న మహిళలు 

సాహసోపేత నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం  రూపకల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం సాహసోపేత చర్య. అయితే, మన పోలీసు వ్యవస్థ అంత వేగంగా కదులుతుందన్న నమ్మకం లేదు. ఆ అపనమ్మకాన్ని పోగొట్టేలా ‘దిశ’ చట్టాన్ని నిర్ణీత వ్యవధిలో అమలు చేస్తే మహిళలకు అంతకన్నా మేలు మరొకటి ఉండదు.
– అక్కినేని వనజ, రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు, అమరావతి

ఇది మైలురాయి లాంటి చట్టం: రాజ్యసభ ఎంపీ సోనాల్‌ మాన్‌సింగ్‌
‘ఏపీ దిశ’ బిల్లు ఆమోదంపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పలు చానళ్లలో వక్తలు పేర్కొన్నారు. టైమ్స్‌ నౌ చానల్‌లో రాజ్యసభ ఎంపీ సోనాల్‌ మాన్‌సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఇది మైలురాయి లాంటి చట్టం.. దీన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరించాలి. ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను’ అని పేర్కొన్నారు. సీఎన్‌ఎన్‌ 18, వన్‌ ఇండియా హిందీ చానల్, పలు కన్నడ న్యూస్‌ చానల్స్‌ ఈ బిల్లును ప్రశంసించాయి.

మరిన్ని వార్తలు