ఆగ్రహజ్వాల

13 Oct, 2015 00:43 IST|Sakshi
ఆగ్రహజ్వాల

ప్రత్యేక హోదా  ఆంధ్రుల హక్కు
 
జగన్‌కు మద్దతుగా రిలే దీక్షలు
మంత్రుల వ్యాఖ్యలపై దిష్టిబొమ్మల దహనం
గుంటూరుకు తరలివెళ్తున్న జనం

 
విజయవాడ :   ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా విపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. వాడవాడలా జగన్‌కు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  జిల్లావ్యాప్తంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. సోమవారం విజయవాడతోపాటు జిల్లాలోని   పలు గ్రామాల్లో మహిళలు, విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా ప్రదర్శనలు, మానవహారాలు, ప్రార్థనలు, నిరసన దీక్షలు చేపట్టారు. జగన్ ఆరోగ్యపరిస్థితి క్షీణించిందని తెలుసుకున్న అభిమానులు హుటాహుటిన గుంటూరు పయనమయ్యారు.   విజయవాడ సింగ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో 13 నియోజకవర్గాలలో 49 మండలాల్లో రిలేదీక్షలు చేపట్టారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు విఫల యత్నం చేశారు.

కొనసాగుతున్న దీక్షలు
మచిలీపట్నం, పెడనల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పేర్ని వెంకట్రామయ్య,ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. జగన్ ఆరోగ్యం కోసం  ఆలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. గూడూరులో రిలేదీక్షలు చేశారు.  కైకలూరు నియోజకవర్గంలో దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల్లో రిలేదీక్షలు నిర్వహించారు. కైకలూరులో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పామర్రులో  ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులు దిష్టిబొమ్మను ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దక్షిణ కృష్ణా పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆద్వర్యంలో కంకిపాడులో ప్రత్యేక హోదాకోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. కంకిపాడు, ఉయ్యూరులో రిలేదీక్షలు కొనసాగాయి.

గన్నవరంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో గన్నవరం, తేలప్రోలు, హనుమాన్‌జంక్షన్‌లలో దీక్షలు కొనసాగాయి. నిడమానూరులో పార్టీకార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ  నిర్వహించారు.  నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు నాయకత్వంలో నూజివీడు, ముసునూరు, ఆగిరపల్లి, చాట్రాయి మండలాల్లో దీక్షలు కొనసాగాయి. నూజివీడులో చినగాంధీబొమ్మసెంటర్‌లో  పార్టీ కార్యకర్తలు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్‌లకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు.

 తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు, తిరువూరు,  గంపలగూడెం మండలాల్లో దీక్షలు జరిగాయి. విస్సన్నపేటలో వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. నందిగామ నియోజకవర్గంలో  పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు,  రాష్ట్ర కార్యదర్శి మెండితోక  అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు.  కంచికచర్ల, చందర్లపాడులో ఆలయాలు,చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు. వీరులపాడు మండలం అల్లూరు  సర్పంచ్  కె. సూర్యనారాయణ రెడ్డి జగన్ దీక్షకు మద్దతుగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది.   అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, నాగాయలంకలో చేపట్టిన దీక్షలు ఐదోరోజుకు చేరుకోగా, కోడూరు, ఘంటసాలలో దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ ఆద్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలో జగన్‌ఆరోగ్యం కోసం ఆయన పూజలు జరిపారు.
 
 

మరిన్ని వార్తలు