జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు వెల్లువెత్తిన సంఘీభావం

26 Aug, 2013 04:16 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్షకు వెల్లువెత్తిన సంఘీభావం

 సాక్షి, నెట్‌వర్క్: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సమైక్యవాదులు ఆమరణ దీక్షలకు దిగారు. అనేకచోట్ల రిలే నిరాహారదీక్షలు, మద్దతుగా ర్యాలీలు, మావనహారాలు జరిగాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజవర్గ సమన్వయకర్త షమీమ్ అస్లాం జగన్ దీక్షకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సీ, మదనపల్లె నియోజకవర్గ సమన్వకర్త దేశాయి తిప్పారెడ్డి చేపట్టిన దీక్షలకు రాజంపేట పార్లమెంటు నియోజవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మద్దతు పలికారు. చిత్తూరులో నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో రాజా, సయ్యద్ సర్దార్, కమలాక్షి సాయిసుజిత్, మధుసూదన్‌రాయల్,  కేకే.రవి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. సత్యవేడులో వైఎస్సార్ వుండల కన్వీనర్ కె.నిరంజన్‌రెడ్డి ఆవురణదీక్ష చేపట్టారు. పుంగనూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మద్దతు పలికారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త పుణ్యమూర్తి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
 పీలేరు సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వాల్మీకిపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరిలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ ఆధ్వర్యంలో రాస్తాకోకో నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ సమన్వయకర్త, మాజీమంత్రి మహమ్మద్ షాకీర్‌తోపాటు రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మాధురి రాజారెడ్డి, రజనీష్‌కుమార్‌రెడ్డి, రమణారెడ్డి, అల్లాబక్ష్ ఆమరణ దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, ఒంటిమిద్ది కిరీటియాదవ్, గుంతకల్లులో ఏపీఎస్సార్టీసీ రాష్ట్రీయ మజ్దూర్ యూనియన్ డిపో గౌరవాధ్యక్షుడు ఎండీ సందీప్‌రెడ్డి, వై.సుధాకర్, మహమ్మద్ రఫీక్, బి.రాము, వినోద్‌కుమార్‌రెడ్డి ఆమరణ దీక్షలు చేపట్టారు. కడప కలెక్టరేట్ వద్ద 55 మంది ముస్లింలు ప్రారంభించిన దీక్షలకు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు,మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, జిల్లా మున్సిపల్ పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
 
 ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్‌లో మహిళలు చేపట్టిన దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.  రాజంపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలి సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలకు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు జక్కంపూడి రాజా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ మలికిపురం కళాశాల కూడలి వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో రెండు గంటల పాటు జలదీక్ష చేశారు. ఆలమూరులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి రిలేదీక్ష చేపట్టారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో ఏర్పాటు చేసిన రిలే దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రిలే దీక్షా శిబిరాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రారంభించారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేతృత్వంలో బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు పగటివేషాలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత  చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ప్రారంభించారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ద్వారకాతిరుమలతో నిర్బంధ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ చలమోలు అశోక్‌గౌడ్ అధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తీన్‌మార్ వాయిద్యాలతో, మోటారు సైకిళ్లతో దెందులూరు, ఏలూరు, పెదపాడు మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
 
 విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ రాజబాబు తగరపువలసలో,  పీలా వెంకటలక్ష్మి, బేతిరెడ్డి విజయ్‌కుమార్, ఎం.డి.బాషా నర్సీపట్నంలో ఆమరణ దీక్షలు చేపట్టారు. తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో పాతగాజువాకలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. చోడవరంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నాయకుడు బండారు సత్యనారాయణ రిలే దీక్షలు ప్రారంభించారు. చోడవరం, రోలుగుంట మండలాల యువజన విభాగం అధ్యక్షులు అల్లం రామ అప్పారావు, బండారు శ్రీనివాసరావు, గుడాల ప్రవీణ్‌కుమార్, కార్లె గీతాకృష్ణ, కొల్లి మురళీకృష్ణ దీక్షలో కూర్చున్నారు. పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త సీక రి సత్యవాణి ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామదేవత అసిరమ్మ తల్లికి ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు ఆధ్వర్యంలో మహిళలు ముర్రాటలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. రాజాం, రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజె బాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మైలవరంలో నిరవధిక నిరాహార దీక్షను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ ప్రారంభించారు. జ్యేష్ఠ శ్రీనాథ్ మైలవరంలో ఆమరణ దీక్ష ప్రారంభించారు. విజయవాడ ఐఎంఏ హాల్ వద్ద వైఎస్సార్ సీపీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ గోసుల శివభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఎన్‌ఎస్‌సీ బోస్‌నగర్‌లో విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహించారు.
 
  పెడనలో పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. నడుపూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ ఐలాండ్ సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆమరణ దీక్షలు ప్రారంభమయ్యాయి. గుంటూరులో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు నసీర్ అహ్మద్, షేక్ షౌకత్ ఆధ్వర్యంలో శంకర్ విలాస్‌సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టారు.
 
 నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయగిరిలో దీక్షలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో తాటి వెంకటేశ్వర్లు, కేవీ రాఘవరెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మానవహారం నిర్వహించడంతో పాటు రోడ్డుపైనే వంటావార్పు చేశారు. సంతనూతలపాడులో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ వరికూటి అమృతపాణి ఆధ్వర్యంలో రోడ్డుపైనే వైద్యశిబిరం నిర్వహించారు.
 
 సమైక్యతతోనే సంక్షేమం : దాడి
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఆంధ్ర, తెలంగాణ , రాయలసీమ ప్రాంతాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు.  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా తగరపువలసలో  వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష  శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికైనా విభజనకు వ్యతిరేకమని చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ ఇచ్చి యాత్రలు చేపడితే తామే ఆహ్వానిస్తామన్నారు.
 
 దీక్షాదక్షుడు జగన్ : భూమన
 సాక్షి, తిరుపతి: ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే దీక్షాదక్షుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా ఆదివారం తిరుపతి తుడా కార్యాలయం సమీపంలోని కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. గిరిజన లంబాడీ మహిళలు నృత్యం చేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ లక్ష్య దీక్ష, జల దీక్ష, ఫీజు పోరు, పోరు దీక్ష, కదనరంగం లాంటి కార్యక్రమాలను గతంలో పెద్దఎత్తున చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి, ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు.
 

మరిన్ని వార్తలు