దట్టమైన అడవిలో...

2 Jul, 2017 01:22 IST|Sakshi
దట్టమైన అడవిలో...
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో విపక్ష నేత జగన్‌ పర్యటన
చాపరాయి జ్వరాల బాధితులకు ఓదార్పు 
 
సాక్షి  ప్రతినిధి, కాకినాడ: మావోయిస్టులకు పెట్టని కోట.. దట్టమైన అడవులు.. దుర్భేద్యమై న కొండలు.. ప్రమాదకరమైన లోయలు.. రాళ్లతో కూడిన ఎగుడు దిగుడు దారి.. ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. ఇదంతా చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అటువంటి తూర్పు కనుమల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయిలో విషజ్వరాల బారిన పడ్డ గిరిజనులను స్వయంగా పరామర్శించి, వారి కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. గిరిపుత్రుల వెతలు విని జగన్‌ చలించిపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. 
 
రంపచోడవరం నుంచి చాపరాయి 
చాపరాయిని సందర్శించేందుకు  జగన్‌ శుక్రవారం రాత్రే రంపచోడవరం చేరుకున్నారు. శనివారం ఉదయమే ఆ గ్రామానికి బయలుదేరారు. తొలుత రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజనులను పరామర్శించారు. అనంతరం మారేడుమిల్లి మీదుగా అడవిబాట పట్టారు. దట్టమైన అడవిలో ఆయన పర్యటన సాగింది. దారి పొడవునా గిరిజనులను కలుసుకుని మాట్లాడారు. ఎక్కడికక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడారికోటలో పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. తరువాత ఘాట్‌రోడ్డులో వర్షంలోనే గంటపాటు ప్రయాణించి చాపరాయికి చేరుకున్నారు. బురదమయమైన రహదారిలో వాహనం ఎక్కడ జారిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన ప్రయాణం సాగించారు.
మరిన్ని వార్తలు