పల్లెకు పండుగొచ్చింది

10 Nov, 2017 01:55 IST|Sakshi

జగన్‌ పాదయాత్ర సాగిన గ్రామాల్లో సందడే సందడి

ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అక్కడ జరుగున్నది పండుగ కాదు... వేడుక, ఉత్సవమో కాదు.. జాతర అసలే కాదు... అయినా ఆ గ్రామాల్లో ప్రతి గుమ్మం ముందూ పచ్చని తోరణాలు... పసుపు రాసిన గడపలు... వీధుల్లో బంతులు, చామంతులు పరిచిన రంగురంగుల ముగ్గులు.. వాడవాడలా కేరింతలు... సందడితో కళకళలాడిన కాలనీలు.. జన సందోహంతో నిండిపోయిన గ్రామాలు.. ఎటు చూసినా కోలాహలమే. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా గురువారం పల్లెల్లో నెలకొన్న సందడి వాతావరణమిది. సాధారణంగా ఏదైనా పండగొస్తేనో... జాతర జరిగితేనో ఈ తరహా సంబరం కన్పిస్తుంది. కానీ, తమ అభిమాన నేత పాదయాత్రనే ప్రజలు పండుగలా జరుపుకోవడం విశేషం. ‘ఇంతకు మించిన పండుగ ఏముంటుంది’ అని ఎర్రగుంట్లకు చెందిన సౌభాగ్య అనే మహిళ అన్నారు. గురువారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్ర జరిగింది.

పుట్టింటికి ఆడపడుచులు
జగన్‌ పాదయాత్ర జరిగిన గ్రామాల్లో జనం కొత్త దుస్తులు వేసుకున్నారు. పురుషులు కొత్త పంచెలు, మహిళలు పట్టుచీరలు ధరించి పాదయాత్రకు వచ్చారు. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయినవారు, వివాహమై అత్తారిళ్లక వెళ్లినవారు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూడడానికి సొంత గ్రామాలకు తరలిరావడం గమనార్హం. ‘‘మా ఊరికి జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారు. ఆయనను చూసేందుకు, పాదయాత్రలో పాల్గొనేందుకు మా కుమార్తె, అల్లుడు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ వచ్చారు’’ అని ఎర్రగుంట చౌరస్తాలో ప్రజాసంకల్ప యాత్ర దగ్గర ఉన్న శ్రీనివాసరావు చెప్పారు.

స్కూళ్లు, కాలేజీలు బంద్‌
ప్రజాసంకల్ప యాత్ర జరిగిన గ్రామాల్లో పాఠశాలు, కళాశాలలకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా పాదయాత్ర వద్దకే వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సిబ్బంది జగన్‌ను చూసేందుకే ఆసక్తి చూపారు. కొంతమంది ఆఫీసులకు సెలవు పెట్టుకున్నారు. దినసరి కూలీలు కూడా పనులకు వెళ్లలేదు. పనులకు వెళ్లిన వాళ్లు త్వరగా ముగించుకుని ఊళ్లకు చేరుకున్నారు.

జగన్‌కు మహిళల హారతులు  
పాదయాత్ర జరిగిన ప్రతీ గ్రామంలోనూ బంతి, చామంతి పూలను రోడ్లపై వెదజల్లారు. బస్తాల కొద్దీ పూలను తీసుకొచ్చి, వాటి రెక్కలు విప్పి పాదయాత్ర జరిగే రోడ్డుపై పరవడం కన్పించింది. ‘‘జగన్‌కు స్వాగతం... జై జగన్‌’’ అంటూ పూలతో రంగవల్లులు తీర్చిదిద్దేందుకు మహిళలు పోటీ పడ్డారు. 

>
మరిన్ని వార్తలు