ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం

18 Mar, 2019 13:33 IST|Sakshi

  పేదలకు పైసా ఖర్చులేకుండా కార్పొరేట్‌ వైద్యానికి జగన్‌ హామీ 

సాక్షి, బిట్రగుంట (నెల్లూరు): ఆరోగ్యశ్రీ... ఈపదం వింటేనే దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందటం లేదని, ఖరీదైన వైద్యం చేయించుకోలేక పేదలు అసువులుబాస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా నిరుపేదలు కూడా నిశ్చింతగా, పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్‌ వైద్యం పొందగలిగారు. దేశ వ్యాప్తంగా ఈ పథకంపై ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. వైఎస్‌ మరణం తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చడం మొదలుపెట్టాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కించింది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో చాలా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. దీంతో ఖరీదైన వ్యాధులకు వైద్యం చేయించుకునే స్తోమత లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రలో ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం ప్రసాదిస్తానని నవరత్నాల్లో భాగం చేశారు. ఏడాడికి రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకూ ఆరోగ్యశ్రీ వర్తింపచేయనున్నట్లు ప్రకటించడంతో పేదల్లో అమితానందం వ్యక్తమవుతుంది.

వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్పత్రి ఖర్చులు వెయ్యి దాటిన వెంటనే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామని జగన్‌ ప్రకటించారు. అంతే కాకుండా పేదలకు రాష్ట్రంలో కార్పొరేట్‌ స్థాయి వైద్యంతో పాటు ఇతర రాష్ట్రాల్లో మెరుగైన వైద్యం కోసం వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపచేయనున్నట్లు ప్రకటించడంపై ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకూ ఉన్న వ్యాధులతో పాటు అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించడం, ఆపరేషన్‌ లేదా చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆర్థికసాయం, కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురైన రోగులకు నెలకు రూ. 10వేలు ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు సంజీవని 
జగన్‌ ప్రకటించిన ఆరోగ్యశ్రీ పేదలకు అపర సంజీవని వంటింది. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని టీడీపీ ప్రభుత్వం అటకెక్కించి పేదల ప్రాణాలతో ఆడుకుంది. జగన్‌ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని మరింత విస్తృత చేస్తానని ప్రకటించడం నిజంగా అభినందనీయం.
– కోడూరు లక్ష్మిరెడ్డి, సుందరగిరివారికండ్రిగ

ఆరోగ్యశ్రీతో పేదల ప్రాణాలకు రక్షణ 
జగన్‌ ప్రకటించిన ఆరోగ్యశ్రీతో పేదల ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరుగార్చింది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాడికి రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకూ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని జగన్‌ ప్రకటించడాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు.
– మద్దిబోయిన వీరరఘు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌

జగన్‌కు ఆ సత్తా ఉంది
ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేసే సత్తా జగన్‌కు మాత్రమే ఉంది. దివంగతనేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అటకెక్కించాయి. ఆరోగ్యశ్రీ మళ్లీ సమర్థవంతంగా అమలు కావాలంటే జగన్‌ అధికారంలోకి రావాలి.
– మేకల శ్రీనివాసులు, అరవపాళెం

ఆరోగ్యానికి భరోసా 
జగన్‌ ప్రకటించిన ఆరోగ్యశ్రీతో పేదల ఆరోగ్యానికి అసలైన భరోసా లభిస్తుంది. ఏడాడికి రూ.10లక్షల వరకూ ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రకటించడం అభినందనీయం. అన్నీ వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పేదలకు పూర్తి భరోసా లభిస్తుంది.
– తుమ్మల రమణయ్య, బోగోలు

మరిన్ని వార్తలు