ఏప్రిల్‌ నెలకూ ‘జగనన్న గోరుముద్ద’

29 Mar, 2020 04:46 IST|Sakshi
గుంటూరు జిల్లా కారంపూడి మండలంలో జగనన్న గోరుముద్ద బియ్యం, గుడ్లు, చిక్కీ పంపిణీ చేస్తున్న గ్రామ వలంటీర్లు (ఫైల్‌)

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

కరోనా వైరస్‌తో పోరాడుతూనే విద్యార్థుల కడుపు నింపే యత్నం 

ఇప్పటికే మార్చి నెలాఖరుకు సరిపడా సరకుల పంపిణీ 

రెండో దశలో ఏప్రిల్‌ ఒకటి నుంచి 14 వరకు పరిగణనలోకి తీసుకుని పంపిణీకి ఉత్తర్వులు

పాఠశాలలు తెరవకుంటే ఏప్రిల్‌ 23 వరకూ సరఫరా చేసేలా చర్యలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించడం లేదు. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని వారి ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో మార్చి 19 నుంచి 31 వరకూ తొమ్మిది పని దినాలకుగాను రాష్ట్రవ్యాప్తంగా 45,753 ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 37 లక్షల మంది విద్యార్థులకు బియ్యం, కోడిగుడ్లు, చిక్కీని అందజేసింది. ఇప్పుడు రెండో దశ కార్యక్రమాన్ని అమలు పర్చేందుకు నిర్ణయించింది. 

- ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 14 వరకూ తొమ్మిది రోజుల పాటు పాఠశాలల పనిదినాలను లెక్కించి ఆ మేరకు ఇళ్లలో ఉంటున్న విద్యార్థులకు సరుకుల పంపిణీకి శనివారం ఉత్తర్వులిచ్చింది.
- ఏప్రిల్‌ 14 తర్వాత  పాఠశాలలను తెరవకుంటే విద్యాసంవత్సరం చివరి రోజైన 23 వరకూ పరిగణనలోకి తీసుకుని మొత్తం 17 రోజులకు సరుకులు సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్‌ కె.రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రారంభిస్తామన్నారు.
- ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కేజీ 700 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 2 కేజీల 550 గ్రాముల చొప్పున బియ్యం అందిస్తారు. 
- ఒక్కో విద్యార్థికి తొమ్మిది చిక్కీలు, 17 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు. 
- గ్రామ, వార్డు వలంటీర్లు, సిబ్బంది ద్వారా విద్యార్థుల ఇంటికి వెళ్లిమరీ వీటిని పంపిణీ చేయనున్నారు.
- పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటించాలని ఎంఈవోలు, హెచ్‌ఎంలు, వలంటీర్లకు రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు.

మరిన్ని వార్తలు