11.87 లక్షల మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన

22 Feb, 2020 04:16 IST|Sakshi

తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,139.16 కోట్లు జమ

ఈ నెల 24న విజయనగరంలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: నవరత్నాల్లో మరో హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రంగం సిద్ధం చేశారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి 20 వేల రూపాయల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన విజయనగరంలో ప్రారంభించనున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న వారికే వసతి దీవెన ఇస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కూడా వర్తింప చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం వర్తించే విద్యార్థుల సంఖ్య పెరిగింది. జగనన్న వసతి దీవెనను 11,87,904 మంది విద్యార్థులకు వర్తింప చేయనున్నారు.

తొలి విడత విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.1,139.16 కోట్లను జమ చేయనున్నారు. ఏడాదికి రెండు సార్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇప్పుడు 24వ తేదీన తొలి విడతలో 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, 86,896 మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.7,500 చొప్పున, డిగ్రీ ఆ పై చదువుతున్న 10,47,288 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేయనున్నారు.

25వ తేదీ నుంచి జగనన్న విద్యా, వసతి దీవెన కార్డులను గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి అందజేయనున్నారు. వసతి దీవెన నగదు అందినట్లు విద్యార్థుల తల్లుల నుంచి రశీదులు స్వీకరించనున్నారు. 24వ తేదీన రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించారు.

మరిన్ని వార్తలు