నేతన్నకు జగనన్న అండాదండా

27 Jul, 2013 03:43 IST|Sakshi
నేతన్నకు జగనన్న అండాదండా

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అమ్మా! ప్రాణాలు చాలా విలువైనవి. సమస్యలు వస్తాయి, పోతాయి, వాటికి భయపడి మీ ప్రాణాలు తీసుకోవద్దు. కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలోనే రాజన్న సువర్ణయుగం మళ్లీ వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత చేనేత రంగాన్ని మళ్లీ నిలబెడతారు. అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. చేనేత కార్మికుల బతుకులు బాగుపడడానికి ఏమేం చేయాలన్నది జగనన్న ఎప్పుడో ఆలోచన చేశారు. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో ఆ ఆలోచనలన్నింటినీ అమలు చేస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. చేనేత కార్మికులకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, నర్సన్నపేట నియోజకవర్గాల్లో సాగింది. ఆమదాలవలస నియోజకవర్గంలోని శిలగాంసింగువలసకు చెందిన చేనేత కార్మికులు అలికాం వద్ద కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నప్పుడు షర్మిల పైవ్యాఖ్యలు చేశారు.

బడి సంగతి దేవుడెరుగు.. తిండే పెట్టలేకున్నాం..

చేనేత కార్మికురాలు ఉట్ల కమలమ్మ, శశికళ షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘నాలుగు కిలోల నూలుకు రూ.1,000 ఉంది. అన్ని ముడి సరుకులూ కలుపుకొంటే ఒక్క నేయటానికే రూ.2,000 ఖర్చు అవుతుంది. అదే బట్టను మార్కెట్‌కు తీసుకొని పోతే రూ.2,300 నుంచి రూ.2,500 ధర పలకదు. వచ్చిన రాబడితో పిల్లలను బడికి పంపు సంగతి దేవుడెరుగు తిండి కూడా పెట్టలేకపోతున్నాం. ఈ రోజు కాకపోతే రేపైనా ధర రాకపోతుందా.. సర్కారు సాయం చేయకపోతుందా.. అని అప్పులు తెచ్చి మగ్గం నేసినం. చేసిన అప్పులు తీరక, అప్పులిచ్చిన వారికి సమాధానం చెప్పలేక మాకు ఆత్మహత్యలే దిక్కయ్యేట్టున్నాయి’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఇంటిల్లిపాదీ కలిసి పని చేసినా నెలకు రూ.2,000 రావటం లేదు. సొంతంగా బట్ట నేద్దామంటే నూలు ధర, జర ధరలు కొనలేనంతగా పెంచారు. ఇంట్లో ఆరేళ్ల పిల్లాడు నూలు కండె చుడతాడు. ముసలోళ్లు ఉంటే రాట్నం తిప్పుతారు. ఇంత మందిమి కష్టపడితే ఒక్క బట్ట నేయటానికి కనీసం వారం రోజులు పడుతుంది. నేసిన బట్టకు సేటు రూ.500 కూలీ కట్టిత్తారు. ఈ రూ.500తో ఎలా బతకాలమ్మా? పిల్లలు పస్తులు పడుతుంటే చూడలేకపోతున్నామమ్మా. ఈ నరకం చూడటం కంటే చావడమే మంచిదనిపిస్తుంది’’ అని మరో చేనేత కార్మికురాలు సైతాల పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. అధైర్యపడవద్దంటూ షర్మిల వారికి ధైర్యం చెప్పారు.

వైఎస్ పథకాలన్నీ జగనన్న అమలు చేస్తారు..

చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఒక్క చేనేత కార్మికులకు గురించే కాదు, వృద్ధులు, రైతులు, వికలాంగులు, వితంతువులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరి గురించీ జగనన్న ఎప్పుడో ఆలోచన చేశారు. మన విద్యార్థుల కోసం మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంటు, పేదల కోసం ఆరోగ్యశ్రీ నిలబెడుతారు వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ.700 చేస్తారు. వికలాంగులకైతే 1,000 పింఛను ఇస్తారు. అక్కాచెల్లెళ్లు వాళ్ల పిల్లలను చదివించేటట్లు ప్రోత్సహించడం కోసం పదో తరగతి వరకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంటర్మీడియెట్ చదివితే నెలకు రూ.700 చొప్పున ఏడాదికి రూ.8,400, డిగ్రీ చదివితే నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12,000 అమ్మ అకౌంట్లోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎలాగూ ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు కూడా మళ్లీ ఎప్పటిలాగే ధీమాగా పెద్దాసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయంచుకునే రోజులు మళ్లీ వస్తాయి. మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తారు. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికి నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు’’ అని హామీ ఇచ్చారు.

14.1 కిలోమీటర్ల మేర యాత్ర..

పాదయాత్ర 221వ రోజు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని శిలగాంసింగువలస గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అలికాం కాలనీ, భైరి జంక్షన్, కరజాడ, మడపాం మీదుగా నర్సన్నపేట నియోజకవర్గంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి దేవాది, పామర్తి మీదుగా పాదయాత్ర చేశారు. గుండువిల్లిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.15 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 14.1 కిలోమీటర్లు నడచిన ఇప్పటి వరకు మొత్తం 2,969.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, ఆమదాలవలస నియోజకవర్గం సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కళ్యాణి, వైవీ సూర్యనారాయణ, స్థానిక నాయకులు జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, కూన మంగమ్మ, దవళ వెంకటగిరిబాబు తదితరులు ఉన్నారు.



‘చదువు పూర్తయిన వెంటనే ఉపాధి కల్పించేందుకు జగనన్న ఆలోచన చేస్తున్నారు’

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వైఎస్సార్ రైతు బాంధవుడని శ్రీకాకుళం మండలం నైర వ్యవసాయ కళాశాల విద్యార్థులు అభివర్ణించారు. పాదయాత్రతో ఈ కాలేజ్ ముందు నుంచి వెళ్తున్న షర్మిలకు విద్యార్థులు స్వాగతం పలికారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ‘‘మేడమ్.. మేమంతా అగ్రికల్చరల్ బీఎస్సీ విద్యార్థులం.. మాకు ఈ రంగంలో ఉద్యోగావకాశాలు రాను రాను త గ్గిపోతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి, అనుబంధ విభాగాలకు విశేష ప్రోత్సాహం లభించేది. మాలాంటి వారికి ఉద్యోగావకాశాలుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ.. చదువు పూర్తి చేసుకున్న వెంటనే యువతకు ఉపాధి కల్పించేలా జగనన్న ఆలోచనలు చేస్తున్నాడని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అన్ని రంగాల వారికి మెరుగైన పాలన అందిస్తారని అన్నారు.
 

మరిన్ని వార్తలు