వస్తున్నాయ్‌ జగన్నాథ రథచక్రాల్‌

1 Jul, 2019 08:07 IST|Sakshi
పూరీ ఆలయ నమూనాలో జగన్నాథస్వామి ఆలయం 

జగన్నాథ స్వామి రథయాత్రకు సిద్ధం

4 నుంచి ఉత్సవాలు

సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) : ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకత గాంచిన పాలకొండ జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 4 నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవా లు నిర్వహించడం ఆనవాయితీ. పూరి ఆలయ తరహాలో ఇక్కడి ఆలయం ఉండడం ప్రత్యేకం. స్వామి వారి విగ్రహాలను తరలించే రథం సుమారు 50 అడుగులు ఉంటుంది. ఆరువందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రథయాత్రకు మన రాష్ట్రంతో పా టు ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా దేవాదాయ శాఖ ఏర్పాట్లు మాత్రం ఆ స్థాయిలో చేపట్టడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

యాత్ర వివరాలు..
4న మొదటి రథయాత్ర తొలిదశమి విగ్రహానికి సంప్రోక్షణం చేసి రథంపై ఉంచుతారు. 5న ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. 6 నుంచి స్వామి వారు పలు అవతారాల్లో భక్తులకు కనువిందు చేస్తారు. 6న మత్సా్యవతారం, 7న కూర్మావతారం, 8న హిరాపంచమి సందర్భంగా శ్రీ వరాహ–నరసింహస్వామి అవతారం, 9న వామన పరశురాం అవతారం, 10న రామ–బలరామ అవతారం, 11న కల్కి–జగన్మోహిని అవతారం, 12న మారుదశమి స్వామి వారి నిజరూప దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి తిరుగు రథయాత్ర 13న ప్రారంభమై 14న స్వామి విగ్రహాలను ప్రధాన ఆలయంలోనికి తీసుకువెళ్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ఆలయ అర్చకులు మఠం విశ్వనాథ దాసు స్వామి చరిత్ర కథ రూపంలో భక్తులకు వివరిస్తారు.

భక్తులకు తప్పని అవస్థలు
ఇక్కడి రథయాత్రకు లక్షల్లోనే భక్తులు వస్తుంటారు. అయితే సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఏటా వీరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయం వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికీ ఆలయ కమిటీ లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు యాత్రను తమ ఆధీనంలోకి తీసుకుని దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. రథం పూర్తిగా విరిగిపోయి భక్తుల పైకి వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. యాత్ర చూసేందుకు వచ్చే భక్తులు ఉండేందుకు కనీస సదుపాయాలు ఇక్కడ కనిపించడం లేదు. గత ఏడాది నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావు రహదారి నిర్మాణానికి రూ.6లక్షలు నిధులు కేటాయించి పనులు చేయించినా అందులో నాణ్యత కనిపించలేదు. దీంతో భక్తులు ఈ ఏడాది ఇబ్బంది పడాల్సి వస్తోంది.  

నిలిచిన నూతన రథం తయారీ పనులు
ఇక్కడ ఏళ్ల నాటి రథం పూర్తిగా శిథిలం కావడంతో కొత్తగా రథం తయారు చేయాలని గత ఏడాది చర్యలు తీసుకున్నారు. ఇందుకు కావాల్సిన కలపను ఒడిశా నుంచి తెప్పించారు. ఇరుసులు తయారు చేపట్టిన రెండు రోజుల్లోనూ పనులు నిలిచిపోయాయి. అవసరం ఉన్న కలప లేకపోవడంతో పాటు నిధులు లేమి, పనివారు లేమి కారణాలతో ఈ ఏడాది రథం పనులు పూర్తి కాలేదు. ఉన్న కలప ప్రస్తుతం చెదలు పడుతోంది.

అన్ని చర్యలు తీసుకుంటాం
రథయాత్ర ఉత్సవాలకు సం బంధించి భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చాం. ప్రైవేటు వ్యక్తుల పెత్తనం లేకుండా ఈ ఏడాది చర్యలు చేపడతాం. రహదారిని సక్రమంగా తయారు చేయాలని పంచాయతీ అధికారులకు నివేదించాం. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– ఎస్‌.రాజారావు, ఆలయ ఈవో

మరిన్ని వార్తలు