బెల్లం దిమ్మ దిగాలు

2 May, 2019 12:12 IST|Sakshi

అనకాపల్లి మార్కెట్‌లో పడిపోయిన అమ్మకాలు

నిరాశ మిగిల్చిన గత ఆర్థిక సంవత్సరం

మార్కెట్‌ చరిత్రలో అతి తక్కువగా లావాదేవీలు

గణనీయంగా తగ్గిన చెరకు సాగు విస్తీర్ణం

అనకాపల్లి మార్కెట్‌లో బెల్లం లావాదేవీలు ఏటేటా తగ్గిపోతున్నాయి.  తాజాగా ముగిసిన ఆర్థికసంవత్సరం(2018–2019) మార్కెట్‌ చరిత్రలోనే నిరాశను మిగిల్చింది. సాధారణంగా ఏటా రూ.150 కోట్ల వరకూ లావాదేవీలు ఉంటాయి. రూ.వంద కోట్ల మేర జరిగాయంటే బెల్లం ఉత్పత్తి తగ్గినట్లే. అలాంటిది 2018–19 ఆర్థిక సంవత్సలంలో కేవలం రూ. 91.08 కోట్లకే పరిమితం కావడం మార్కెట్‌ వర్గాలను కలవరపరుస్తోంది. జిల్లాలో చెరకు సాధారణ సాగు విస్తీర్ణం 45వేల హెక్టార్లు. ప్రస్తుతం 34వేల హెక్టార్లకు పడిపోయింది. ఇది ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

అనకాపల్లి: దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన అనకాపల్లి మార్కెట్‌లో బెల్లం వ్యాపారం ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఏటా సంక్రాంతి, దసరా పండుగల సీజన్‌లలో బెల్లానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒకవైపు బెల్లం దిగుబడి గణనీయంగా పడిపోగా, ధర మరీ దారుణంగా పతనమైంది. తయారు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెరకు సాగు, బెల్లం తయారీ అంటేనే ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏటా దెబ్బతీస్తున్నాయి. మార్కెట్‌లో తెల్ల బెల్లాన్ని మొదటి రకంగా భావిస్తారు. దీని తయారీలో సల్ఫర్‌ వినియోగం ఉంటోందంటూ ఫుడ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులతో రైతులు, వర్తకులు ఇబ్బంది పడుతున్నారు. అలాగని నల్లబెల్లం తయారు చేస్తే ధర పడిపోతోంది. ఏడాదంతా కష్టపడి పండించే చెరకును బెల్లంగా తయారీలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. సహజంగా  దాని రంగును వాతావరణం, చెరకు వంగడాలు, నేల స్వభావం, రైతులు వండే విధానం ప్రభావితం చేస్తాయి. ఇలా గిట్టుబాటు కానందున ఇటీవల రైతులు చెరకు సాగుకు దూరమవుతున్నారు. దీని పరిష్కారానికి శాస్త్రవేత్తలు జంట చాళ్ల పద్ధతి, బడ్‌ చిప్‌ చెరకు, టిష్యూ కల్చర్‌ సాగుపై అవగాహన కల్పిస్తున్నా, అది రైతుల వద్దకు చేరడం లేదు.

కిలో దిమ్మల తయారీపైనే దృష్టి..
పరిస్థితులు మారుతున్నాయి. బెల్లం రైతులను చైతన్య పరిచేందుకు మార్కెట్‌ అధికారులు సైతం రంగంలోకి దిగుతున్నారు. సనాతన పద్ధతిలో 12 నుంచి 15 కిలోల బరువుండే దిమ్మలకు కిలోల రూపంలో తయారు చేసి మార్కట్‌కు తరలిస్తున్నారు. వర్తకులు, మార్కెట్‌ కమిటీ అధికారులూ దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు సేంద్రియ బెల్లం తయారీపై కూడా దృష్టి సారించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ఏటేటా తగ్గుతున్న చెరకు విస్తీర్ణం...
జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతోంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 45వేల హెక్టార్లు. ఈ ఏడాది 34 వేల హెక్టార్లకు పడిపోయింది. దిగుబడి మరీ దయనీయంగా ఉంది. చెరకు వంగడాలను రూపొందించినప్పుడు హెక్టార్‌కు 150 టన్నులు ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెక్టార్‌కు కొన్ని ప్రాంతాల్లో 75 టన్నులు, మరికొన్ని చోట్ల 50 టన్నులకు మించడం లేదు. ఇక బెల్లం దిగుబడి కూడా బాగా తగ్గిపోతోంది. అనకాపల్లి మార్కెట్‌కు 2011–2012లో 8.17లక్షల క్వింటాళ్ల బెల్లం వచ్చింది. ఇదే రికార్డు.  2016 ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మొదటి రకాన్ని గుంటూరు రైతులు  క్వింటా రూ. 4500 లకు కొనుగోలు చేశారు. సహజంగా మార్కెట్‌కు అక్టోబర్, నవంబర్‌ నెలల నుంచి బెల్లం వస్తుంది. జిల్లాతో పాటు పొరుగున ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతులు 15కిలో దిమ్మల రూపంలో దీనిని తయారు చేస్తుంటారు. ఈ కారణంగా రిటైల్‌ అమ్మకాలకు ఆస్కారం లేకుండా పోయి నష్టపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో పంపిణీ చేసిన చంద్రన్న కానుకల్లో బెల్లాన్ని కిలో  రూ.39.10లకు సరఫరా చేస్తామని స్థానిక వర్తకులు చెప్పినా ఈ ప్రభుత్వం మాత్రం కిలోకు రూ. 49.70 వంతున చెల్లిస్తూ గుజరాత్‌కు చెందిన వ్యాపారులకు కట్టబెట్టింది. ఆ బెల్లం కూడా కర్నాటక ప్రాంతంలో తయారైనదే. ఇలా రాష్ట్ర రైతులకు, వర్తకులకు నష్టమే మిగిలింది. మార్కెట్‌లో డిమాండ్‌ మేరకు రైతులు ఇక నుంచి కిలో సైజుల్లో తయారు చేస్తే కొద్దిపాటి నష్టాల నుంచి బయటపడవచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం చెరకు రైతులకు ప్రోత్సాహం, మద్దతు ఇవ్వకపోతే చెరకు సాగు రాష్ట్రంలో ప్రశ్నార్థకం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు