జయహో తెలంగాణ

6 Dec, 2013 02:43 IST|Sakshi

 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఫలించనుంది. అమరవీరుల కల త్వరలోనే సాకారం కాబోతుంది. 29వ రాష్ట్రంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జీఓఎం రూపొందించిన తెలంగాణ ముసాయిదా బిల్లుకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణవాదుల్లో ఆనందం పెల్లుబికింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు.
 
 జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఈ నిర్ణయం వెలువడిన వెంటనే జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణవాదులు వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచిపెట్టి సంతోషాన్ని పంచుకున్నారు. టీఆర్‌ఎస్ నేత ఇంతియాజ్ ఇసాక్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట్, షాద్‌నగర్, కొల్లాపూర్, దేవరకద్ర, కొడంగల్, అచ్చంపేట, జడ్చర్ల, అలంపూర్ తదితర నియోజకవర్గాల్లో తెలంగాణవాదులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ రాజధానితో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయనున్నట్లు షిండే ప్రకటించడంతో తెలంగాణవాదుల్లో ఆనందం వ్యక్తమైంది.
 
 గత జులై 30 కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకవ్యాఖ్య తీర్మానంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ వాదులకు సంతోషం కలిగించే విధంగా కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. కేంద్రక్యాబినెట్ నిర్ణయంపై తెలంగాణవాదులు టీవీలకు అత్తుకుని నిర్ణయం ఏం వస్తుందని ఉత్కంఠగా ఎదురుచూశారు. అనుమానాలను పటాపంచలు చేస్తూ పది జిల్లాలో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణవాదుల్లో ఆనందం ఒక్కసారిగా కట్టలు తెగింది.
 
 60 ఏళ్ల కల సాకారమైంది
 తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ ముఖ్యంగా విద్యార్థులకు, తెలంగాణ కోసం అమరులైన వారికి చెందుతుంది. తెలంగాణ ప్రజలు ఎవరిని కష్టపెట్టరు. ఎవరినైన కడుపులో పెట్టుకునే స్వభావం తెలంగాణ ప్రజలకు ఉంది. కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. తెలంగాణను ఏర్పాటు చేస్తున్నందుకు సోనియాగాంధీకి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు. బిల్లు ఆమోదం పొందేలా కృషిచేయాలి.
 - జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి
 
 నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
 తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర క్యాబినె ట్ తెలంగాణ బిల్లుపై ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడాన్ని టీఆర్‌ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. ఇదే వేగాన్ని బిల్లుపెట్టడంపై చూపాలి. కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ ఏర్పాటు జరుగబోతుంది.
 -బెక్కం జనార్దన్,
  టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్
 
 తెలంగాణ ప్రజల కల సాకారం
 తెలంగాణ ప్రజల చిరకాల కోరిక, కల లను సోనియాగాం ధీ సాకారం చేశా రు. 60 ఏళ్లుగా ర గులుతున్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శాశ్వత పరిష్కారం ల భించడం ఆనందదాయకం. నూతన రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం అవుదాం.         
  - డీకే అరుణ, మంత్రి
 
 పార్లమెంటు ఆమోదం ఖాయం
 తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఖాయం. కొత్త రాష్ట్ర ఆవిర్భావం విభజనను అడ్డుకోవడానికి కుట్రలు చేసిన వారికి చెంపపెట్టు. ధర్మ పోరాటంలో న్యాయమే గెలించింది, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి.
 -డాక్టర్ మల్లు రవి,
  పీసీసీ అధికార ప్రతినిధి
 
 బిల్లుపెట్టే దాక అప్రమత్తంగా ఉండాలి
 కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణ బిల్లు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం హర్షనీయమే. అయినా పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదం లభించేవరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రజల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారం చేస్తున్న సోనియాగాంధీకి కృతజ్ఞతలు. బిల్లు పాసైతేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. అప్పుడే నిజమైన సంబరాలు చేసుకోవాలి.
 -రామకృష్ణగౌడ్, టీజీఓ జిల్లా అధ్యక్షుడు  
 

మరిన్ని వార్తలు