‘జై సమైక్యాంధ్ర..’ అనడమే నేరమా!

24 Feb, 2014 03:12 IST|Sakshi
 విజయనగరం క్రైం,  న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం.. విద్యార్థు ల పాలిట శాపంగా మారనుందా..? జై సమైక్యాంధ్ర అని అనడమే వారు చేసిన నేరమా..? సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసులు ఉన్న విద్యార్థులకు.. ఆ సాకు చూపి ప్రభుత్వ ఉద్యోగాలను దూరం చేయనున్నారా..? అనే ప్రశ్నలకు అవున నే సమాధానం వస్తోంది. ఇటీవల కాలం లో పలువురు నిరుద్యోగ యువకులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే, వారు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదని పోలీసుల నుంచి కాండక్ట్ సర్టిఫికెట్ తెస్తేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన యువకుడు ఆర్మీలో ఉద్యోగం పొందాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేనట్లుగా ఆ పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్ నుంచి కండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఆర్మీ అధికారులు ఆ యువకుడికి సూచించారు. దీంతో ఆ విద్యార్థి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. 
 
 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని.. 
 రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటాయని వేలాది మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టారు. విజయనగరం పట్టణంలో ఉద్యమం కాస్త తీవ్ర స్థాయికి చేరి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పీసీసీ చీఫ్ బొత్స ఇంటి, ఆస్తులు, అనుచరుల ఇళ్లపై సమైక్యాంధ్ర ఉద్యమకారు లు దాడులు చేశారు. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైనా పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులు పీసీసీ చీఫ్ బొత్స ఆదేశాలకు అనుగుణంగానే జరిగాయన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. 
 
 మంత్రి మెప్పుకోసం కేసులు పెట్టి... 
 మంత్రి  మెప్పుకోసం విద్యార్థులపైన, సమైక్యాంధ్ర ఉద్యమకారులపైన పోలీసులు కేసులు పెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగానే స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ప్రతిపక్ష పార్టీలకు చెంది న వారిపై ముఖ్యంగా కొరడా ఝులి పించారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను వెంటాడి.. వెంటాడి మరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలో సుమారు 800 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  
 
 కేసులు ఎత్తివేసినట్లు ప్రకటించలేదేం..?
 తెలంగాణ ఉద్యమంలో విధ్వంసాలకు పాల్పడిన విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పార్టీల కు అతీతంగా  ఆ ప్రాంత ప్రజాప్రతి నిధులు, ఉద్యోగ సంఘాల నేతలు పోరాటాలు చేశారు. వారందరూ ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విన్నవించారు. దీంతో అక్కడి ఉద్యమకారులపై కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. సీమాంధ్రకు వచ్చేసరికి సమైక్యాంధ్రలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం శోచనీయం. మన ప్రజాప్రతినిధుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
మరిన్ని వార్తలు