అన్నదాతల ఆత్మహత్యలకూ చలించరా?

10 Aug, 2018 13:09 IST|Sakshi
జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ వద్ద నాయకులు, రైతులు

అనకాపల్లిటౌన్‌: అన్నదాతలు అప్పులపాలై  ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని   రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యనారాయణ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఇక్కడ జైల్‌భరో నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు 118 మందిని అరెస్టు చేసి, పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 555 జిల్లాలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. వ్యవసాయ భూములను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు.   

భూములను అన్‌లైన్‌లో నమోదు చేయాలంటే ఎకరాకు  రూ.30వేలు లంచం తీసుకుంటున్నారని తెలిపారు. బడాబాబులు, కార్పొరేట్‌ సంస్థలకు రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని తెలిపారు.  బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఆధికారంలోనికి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు భద్రత లేకుండా పోవడంతో వారు పట్టణాలకు వలసపోవలసి వస్తోందన్నారు.  స్వామినాథన్‌ కమిటీ సూచనల మేరకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి  అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన కోరారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా రుణవిముక్తి చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని యథాతధంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి  కె.లోకనాథం మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంలో చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు బకాయి ఉన్న  కార్పొరేట్‌ సంస్థలకు రుణమాఫీ చేయడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు కల్లబొల్లిమాటలు చెప్పి మరోసారి  గద్దెనెక్కడానికి సిద్ధపడుతున్నారన్నారు.  మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఆశవర్కర్లు, తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీ రైతులను రోడ్డున పడేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతందన్నారు. 60 సంవత్సరాలు దాటిన పేద, మధ్యతరగతి రైతులకు నెలకు రూ.5వేల చొప్పున పింఛన్‌ అందజేయాలని కోరారు.

వచ్చేనెల 5న 10 లక్షల మంది రైతులతో పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.    ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి మళ్ల సత్యనారాయణ, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఐద్వా జిల్లా సహయకార్యదర్శి డి.డి.వరలక్ష్మి, బుగిడి నూక అప్పారావు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు