హోంమంత్రి ఇంటిముందు అర్థరాత్రి బైఠాయింపు

9 Nov, 2017 10:19 IST|Sakshi
అర్థరాత్రి హోంమంత్రి ఇంటిముందు బైఠాయించిన రాజా

ఎస్సై నాగరాజును సస్పెండ్‌ చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇంటి వద్ద ఆందోళనకు దిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమహేంద్రవరం వైపు తరలించారు. ఇటీవల తనపై దాడి చేసిన రామ చంద్రపురం ఎస్సై కె. నాగరాజును సస్పెండ్‌ చేయాలని కోరు తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, తన సోదరుడు గణేష్, రామ జోగి, వంకా శ్రీహరి తదితరులతో కలసి జక్కంపూడి రాజా బుధవారం రాత్రి 11.15 గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలోని హోంమంత్రి ఇంటి ముందు బైఠాయించారు.

ఆ సమయంలో మంత్రి రాజప్ప ఇంట్లో లేరు. రాజా ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ వర్మ, సీఐ కృష్ణ చైతన్య తమ సిబ్బందితో వచ్చి రాజా తదితరులను బలవంతంగా అదుపు లోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం వైపు తరలించగా ఆందోళన చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు హోంమంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. రాజాపై దాడి జరిగి ఇన్నాళ్లయినా ఎస్సైపై ఇంతవరకు చర్య తీసుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు