బాలికను అన్ని విధాలా ఆదుకుంటాం

22 Jul, 2020 09:36 IST|Sakshi
బాలికను పరామర్శిస్తున్న కాపు కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే రాజా, మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ అమ్మాజీ

రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా  

లైంగికదాడి ఘటనను సీఎం దృష్టికి తీసుకువెళతాం

రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపాటి అమ్మాజీ

తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): లైంగికదాడికి గురైన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన బాలికను ఆదుకుంటామని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. అత్యాచారానికి గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపాటి అమ్మాజీతో కలసి పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చి, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళల భద్రత కోసం దిశ చట్టం రూపొందించారని తెలిపారు. మైనర్‌ బాలికపై జరిగిన సంఘటనపై స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.

రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ అమ్మాజీ వచ్చి బాలికను పరామర్శించి పూర్తి వివరాలు సేకరించారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో పాటు 12 మందిని అరెస్ట్‌ చేశారని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్‌ చేస్తారన్నారు. మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపాటి అమ్మాజీ మాట్లాడుతూ బాలికపై లైంగికదాడికి పాల్పడి చిత్రహింసలకు గురి చేయడం బాధాకరమన్నారు. మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంఘటన బాధాకరమని, సీఎం దృష్టికి తీసుకువెళతామని బాలికకు ఆర్థికంగా, అండగా ఉంటామని కేసు ఫైయిలైన నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలికి వైద్యపరంగా అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్‌ టి.రమేష్‌ కిశోర్, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలా రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ఈతకోటి బాపన సుధారాణి, బొంతా శ్రీహరి, ఎస్సీసెల్‌ నాయకులు మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, మాసా రామ్‌ జోగ్, పెంకే సురేష్, వాసంశెట్టి గంగాధరరావు, తదిరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు