రంగంపేటలో వేడుకగా జల్లికట్టు!

16 Jan, 2020 12:42 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సంప్రదాయ క్రీడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఇక్కడి వీధులన్ని కిక్కిరిసిపోయాయి. మేడలు, మిద్దెలు ఎక్కి జనం జల్లికట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారు. సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌బాబు కూడా జల్లికట్టును తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. ఓ మిద్దెపై నుంచి వారు జల్లికట్టు ఉత్సవాన్ని తిలకించారు. ప్రస్తుతం జల్లికట్టు జోరుగా సాగుతోంది. జల్లికట్టులో భాగంగా పరిగెత్తుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.

అయితే, ఈ వేడుకలో ఎప్పటిలాగే చిన్న చిన్న అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. దూసుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న  గాయాలపాలవుతున్నారు. ఎద్దులను అదుపుచేసే క్రమంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.


ఇక, జల్లికట్టు ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లా కూడా గుర్తుకు వస్తుంది. పశువుల పండుగ పేరుతో నిర్వహించే ఈ జల్లికట్టుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి సందర్బంగా నిర్వహించే ఈ జల్లికట్టును తిలకించడాని వేలాదిమంది వస్తారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు చాలా ప్రాంతాలలో జరుగుతున్నా... చంద్రగిరి మండలం రంగంపేట హైలెట్ గా నిలుస్తోంది. ఇవాళ ఉదయాన్నే పశువులకు పూజలు చేస్తారు. అనంతరం కోడిగిత్తలను అలంకరిస్తారు. కొమ్ముల మధ్య చెక్క పలకలు, కొమ్ములకు కొత్త తవళ్లు చూడతారు. గుంపులు గుంపులుగా వీధిలోకి వదులుతారు. కొమ్ములు తిరిగిన కోడె గిత్తలు పరుగులు తీస్తుంటే వాటిని నిలువరించడానికి యువకులు పోటీ పడతారు.. ప్రాణాలను సైతం లెక్క చేయరు. ఎందుకంటే కోడె గిత్తలను నిలువరించిన వారిని సాహస వంతులుగా ఈ ప్రాంత వాసులు భావిస్తుంటారు. అందుకే యువకుల కేరింతల మధ్య కోడె గిత్తలను పట్టుకోవడానికి పోటీ పడతారు. ఈ దృశ్యాలను తిలకించదానికి రంగంపేటకు వేలమంది హాజరవుతారు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి జల్లికట్టును ఓ పండుగలా చేసుకొంటారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా