జనజాతర

3 Mar, 2014 02:38 IST|Sakshi
జనజాతర

 శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థస్నాన ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తజనం పోటెత్తించి. భక్తిపారవశ్యంతో వంశధార తీరాన్ని ముంచెత్తింది. బురద నీరు, సౌకర్యాల లేమి వంటి సమస్యలను ఏమాత్రం ఖాతరు చేయకుండా లక్షల సంఖ్యలో భక్తులు ముఖలింగేశ్వరుని దర్శనమే పరమావధిగా తరలిరావడంతో శ్రీముఖలింగం, మిరియాపల్లి తీరాలు కిటకిటలాడాయి.
 
 
 జలుమూరు/ఎల్.ఎన్.పేట,
 శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థస్నానాలతో వంశధార నదీ తీరం శివభక్త సాగరంగా మారింది. శివనామ స్మరణతో ఘోషించింది. నాలుగు రోజులుగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం స్వామివారి చక్రతీర్థస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ఆలయం నుంచి స్వామివారి తిరువీధి ప్రారంభమైంది. ఇది నదికి చేరే సరికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. సంప్రదాయం ప్రకారం ఎల్.ఎన్.పేట మండలం మిరియప్పల్లి వద్ద గ్రామానికి చెందిన లుకలాపు కుటుంబీకులు శివపార్వతుల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా జలాభిషేకం చేశారు. నేతవస్త్రాలను సమర్పించారు.
 

బారులు తీరిన భక్తులు
 స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి దాటిన నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూకట్టారు. దీంతో శ్రీముఖలింగం వీధులు భక్తులతో కిటకిటలాడారుు. జిల్లాతో పాటు విజ యనగరం, విశాఖ పట్నం, ఒడిశా నుంచి సుమారు మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. ఏటా 1.50 లక్షల మంది చక్రతీర్థస్నానాల్లో పాల్గొనేవారు. ఈ ఏడాది రెట్టింపు స్థారుులో భక్తులు రావడంతో వంశధార నదిలో నీరు చాలక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్నానం ఘట్టం పూర్తరుున తరువాత స్వామివారిని పందిర వరకూ తీసుకెళ్లలేదు. దీంతో చాలమంది భక్తులకు ముఖలింగేశ్వరిని చూసే భాగ్యం కలగలేదు. స్వామివారిని ప్రధాన ఆలయం నుంచి తీసుకెళ్లేముందు పర్లాఖిమిడి రాజు పేరిట అర్చన చేశారు. బెంగుళూరు నుంచి తెచ్చిన పూలతో ఉత్సవవిగ్రహాలను అలంకరించారు. అనంతరం నందివాహనానికి తహశీల్దార్ పీవీఎల్‌ఎన్ గంగాధరరావు కొబ్బరికాయ కొట్టి తీరువీధి ప్రారంభించారు. వీఐపీలు, పోలీస్ కుటుంబ సభ్యులకే స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. దీంతో సామాన్యులకు నిరాశే ఎదురైంది. చక్రతీర్థస్నానం అనంతరం స్వామివారిని అదే నంది వాహనంపై తెచ్చి ప్రధానాలయ గర్బగుడిలో యథాస్థానంలో ఉంచారు. సాయంత్రం లింగాభరణ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి సంప్రోక్షణ చేశారు.

 కానరాని పంచాయతీ సిబ్బంది

 భక్తులకు పలువురు దాతలు వాటర్ ప్యాకెట్‌లు, పులిహోర ప్రసాదాలు అందించినా కనీసం పంచాయతీ సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. టీడీపీ నాయకులు బగ్గు రమణమూర్తి, నగిరికటగాంకు చెందిన ఎం.రమణమూర్తి అన్నదానం చేశారు. సత్యసాయి సేవా సమితి సభ్యుడు పైడి శెట్టి వెంకటరమణ, శ్రీముఖలింగ ఆలయ మాజీ చైర్మన్ కె.హరిప్రసాద్‌లు తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు,ట్రైనీ డీఎస్పీ ఎం.స్నేహిత  అధ్వర్యంలో 400 మంది పోలిస్ బందోబస్త్ నిర్వహించగా అదనంగా 90 మంది వరకూ ప్రత్యేక బలగాలును ఉపయోగించారు. అర్‌టీసీవారు శ్రీకాకుళం, టెక్కలి డిపోల నుంచి 50 వరకూ అదనపు బస్‌సర్వీసులు నడిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సీహెచ్ ప్రభాకరరావు, ఆలయ చైర్మన్ బి.బలరాం, అర్చకసంఘ అధ్యక్షుడు టి.పెద్దలింగన్నతో పాటు అర్చకులు పాల్గొన్నారు.

 విగ్రహాలు దించేందుకు వాదులాట
 చక్రతీర్థస్నానాలకు మిరియప్పల్లి రేవువద్ద ఏర్పాటు చేసిన పందిరి వద్దకు తీసుకువచ్చిన పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నంది వాహనంపై నుంచి దించేందుకు పూజారులు అంగీకరించకపోవడంతో మిరియాపల్లి గ్రామానికి చెందిన లుకలాపు కుటింబీకులు నిలదీశారు. సంప్రదాయం ప్రకారం విగ్రహాలను నదిలోకి దించి స్నానమాచరించాలని పట్టుబట్టారు. దీంతో వీరిమధ్య వాదోపవాదనలు జరిగాయి. చివరికి విగ్రహాలను నదిలోకిదించి స్నానమాచరించారు. కార్యక్రమంలో మిరియప్పల్లి సర్పంచ్ లుకలాపు సుధారాణి, ఆనందరావు, తిరుమలరావు, రాజారావు, లక్ష్మీనారాయణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు