బాబు సాక్షిగా.. జన్మభుమికి ద్రోహం

28 Mar, 2019 12:29 IST|Sakshi
కొప్పర్రులో తవ్వకాలు నిర్వహిస్తున్న జన్మభూమి కమిటీ సభ్యులు

సాక్షి, గుంటూరు : ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీలు ఆమోదం తెలపాల్సిందే.. ప్రతి పనికీ జన్మభూమి కమిటీ సభ్యులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే.. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజ్యాంగేతర శక్తిగా, కమిటీలోని సభ్యులు షాడో అధికారులుగా చెలామణి అవుతూ ప్రజలను అడ్డగోలుగా దోచుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు నమోదు నుంచే జన్మభూమి కమిటీల పెత్తనం ప్రారంభించారు.

హౌసింగ్, వృద్ధాప్య పింఛన్, రేషన్‌ కార్డు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌ల రుణాల దరఖాస్తులపై జన్మభూమి కమిటీ సభ్యుల, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జుల రబ్బర్‌స్టాంప్‌లు ఉంటేనే అధికారుల పరిశీలనకు తీసుకున్నారు. ఇలా వీరి అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.  జాతిపిత బాపూజీ కలలుగన్న గ్రామీణ స్వరాజ్యంలో తెలుగుదేశం ప్రభుత్వ పుణ్యమా అని ప్రజలచే ఎన్నికైన గ్రామ ప్రథమ పౌరులు(సర్పంచ్‌లు) ద్వితీయ పౌరులుగా మారారు.

పంచాయతీల సర్పంచ్‌ల అధికారాలను జన్మభూమి కమిటీలతో చెక్‌ పెట్టారు. జన్మభూమి కమిటీల  నీడలో ఉనికి కోల్పోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కుల కోసం అప్పట్లో గళం విప్పారు. అధికార పార్టీ కార్యకర్తలకు మినహా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ససేమిరా అంటున్న వైనాన్ని తూర్పారబట్టారు. సంక్షేమ పథకాలు అందని నిరుపేదలు  కలెక్టర్, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.

నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా పరిధిలోని చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు సర్పంచ్‌లు జన్మభూమి కమిటీల పెత్తనాన్ని తెలియజేశారు. రాజ్యాంగేతర శక్తులుగా సంక్షేమ పథకాలను తన్నుకుపోతున్న వైనాన్ని వివరించారు. 

టీడీపీ నేతలు ఒప్పుకున్నారు
టీడీపీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మహానాడు సభలో సీఎం ముందే జన్మభూమి కమిటీలు రాజ్యాంగేత శక్తుల్లా ప్రజలను దోచుకుంటున్నాయని కుండబద్దలు కొట్టారు. స్థానిక శాసనసభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీలను కూడా జన్మభూమి కమిటీల ముందు టీడీపీ ప్రభుత్వం డమ్మీలను చేసింది. జన్మభూమి కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాలకే పెద్దపీట వేసింది.

ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత వీరికి అప్పగించడంతో కమిటీల సభ్యులు కమీషన్లు వసూలు చేశారు. టీడీపీ సానుభూతి పరుడు, జన్మభూమి కమిటీ సభ్యుడి బంధువు అయితే చాలు అర్హతలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చారు. అర్హులకు మాత్రం మొండి చెయ్యి చూపారు. 

ప్రతి పనికీ కమీషన్‌..
రేషన్‌ కార్డు మంజూరు నుంచి కార్పొరేషన్‌ లోన్‌ల వరకూ ప్రతి పనికీ ఓ రేటు కట్టి జేబులు నింపుకున్నారు. రేషన్‌ కార్డు మంజూరుకు రూ.1000–రూ.5 వేలు, ఆసరా పింఛన్‌కు రూ.2 వేలు–రూ.5 వేలు, కార్పొరేషన్‌ రుణాలకు 10–15 శాతం కమిషన్‌ రూపంలో జన్మభూమి కమిటీ సభ్యులు దోచుకున్నారు. కొంత మంది వద్ద పింఛన్‌ మంజూరయ్యాక 2–5 నెలల పింఛన్‌ మొత్తాన్ని జన్మభూమి కమిటీ సభ్యులు తీసుకున్నారు.

మరుగుదొడ్ల మంజూరుకు రూ.2 వేలు–రూ.5 వేలు కమిషన్‌ తీసుకోగా నిర్మించని మరుగుదొడ్లకు కూడా బిల్లులు చేయించుకుని జిల్లాలోని గుంటూరు నగరం, మంగళగిరి, నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్ల సహా వివిధ నియోజవకర్గాల్లో నిధులు స్వాహా చేశారు. హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ స్కీమ్‌లో జన్మభూమి కమిటీ సభ్యులు రూ.లక్షలు కొట్టేశారంటే అతిశయోక్తి కాదు. ఈ పథకంలో ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 10 వేలు నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు.

వృద్ధులు, వికలాంగులనూ వదల్లేదు..
జన్మభూమి కమిటీ సభ్యులు వృద్ధులు, వికలాంగులు, వితంతువులను కూడా వదల్లేదు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్‌ పంపిణీలో అభాగ్యుల నుంచి కమీషన్లు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.100 చొప్పున దండుకున్నారు. ఆఖరికి టీడీపీ సభ్యత్వ నమోదు రూపంలో జన్మభూమి కమిటీ సభ్యులు రూ.100 చొప్పున వసూలు చేశారు. గుంటూరు, మాచర్ల పట్టణాల్లో ఈ వసూళ్ల బాగోతం బట్టబయలైంది.

మరిన్ని వార్తలు