బ్రౌన్ శాస్త్రి ఇక లేరు

1 Mar, 2014 03:16 IST|Sakshi

కడప కల్చరల్, న్యూస్‌లైన్: సుప్రసిద్ద సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక లేరన్న వార్త శుక్రవారం జిల్లా వాసులను దిగ్భ్రాంతికి లోను చేసింది. రెండు నెలలుగా అస్వస్థతులుగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం 6.50 గంటలకు కన్ను మూసిన విషయం తెలుసుకున్న సాహితీవేత్తలు రిమ్స్‌కు వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకున్నారు.
 
 అనంతరం బ్రౌన్ గ్రంథాలయ సంస్థ ప్రతినిధులు, ఆస్పత్రి అధికారుల సహకారంతో డాక్టర్ హనుమచ్చాస్త్రి కుమారుడు జానమద్ది విజయభాస్కర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దేహాన్ని కడప నగరంలోని ఆయన కలల సౌధం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి చేర్చారు. పురజనుల సందర్శనార్థం ఆయనను మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే ఉంచారు.

అనంతరం కుటుంబ సభ్యులు ఎర్రముక్కపల్లెలోని ఆయన స్వగృహానికి చేర్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని నగరంలోని పలు ముఖ్యమైన కూడళ్ల ద్వారా ఊరేగింపుగా రామకృష్ణ జూనియర్ కళాశాల వద్దగల శ్మశాన వాటికకు చేర్చారు. అక్కడ బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు, పరిచయస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన గురించి తెలిసిన ప్రజలు, అభిమానులు విషణ్ణ వదనాలతో నివాళులర్పించారు.
 
 పలువురి నివాళి...
 డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆయన మృతదేహాన్ని దర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ  నాయకులు సురేష్‌బాబు, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, నాయకులు హరిప్రసాద్, వైవీయూ వీసీ బేతనభట్ల శ్యాంసుందర్, రిజిస్ట్రార్ టి.వాసంతి, వైవీయూ పూర్వ పాలక మండలి సభ్యులు, డాక్టర్ కె.మనోహర్, ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు పి.రామసుబ్బారెడ్డి, పరిశ్రమలశాఖ జీఎం గోపాల్, శాంతిసంఘం కార్యదర్శి రాజారత్నం ఐజాక్, టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, జిల్లా ప్రముఖులు పుష్పగిరి విద్యా సంస్థల అధినేత ఎం.వివేకానందరెడ్డి, రాజోలి వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, ఆడిటర్ల సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకోటిరెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.చెంచిరెడ్డి, నిర్మల హైస్కూలు ఉపాధ్యాయ బృందం, వైవీయూ అధ్యాపకులు, విద్యార్థులు ఆయన  బౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వ అంధుల పాఠశాల సంగీత ఉపాధ్యాయుడు సాంబశివుడు ఆయనను స్తుతిస్తూ ప్రార్థనా గీతాలను ఆలపించారు.
 
 జానమద్ది మృతిపై  సంతాపం
 ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతిపై రాష్ట్ర స్థాయిలో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారిలో కొందరి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి
 
   మా కుటుంబం మరిచిపోలేని మహోన్నత వ్యక్తి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి.  
 -వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి,
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
 
 నేను ఏనాడో బ్రౌన్ శాస్త్రి అని పెట్టిన పేరు డాక్టర్  జానమద్దికి అక్షరాల తగినదని ఇప్పటికీ భావిస్తున్నాను.    -డాక్టర్ సి.నారాయణరెడ్డి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత
 
 డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి సున్నిత హృదయుడు. సునిశిత శ్రామికుడు.
 -నరాల రామారెడ్డి, శతాశధాని, అమెరికా
 
   శాస్త్రజ్ఞుడినైన నాకు డాక్టర్ జానమద్ది పరిచయం కొత్త స్ఫూర్తినిచ్చింది. వైవీయూలో వీసీగా ఉన్నంతకా లం ఆయనతో కలిసి చేసిన కార్యక్రమాలను జీవితంలో మరువలేను.      
 - ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి, పూర్వ ఉప కులపతి, వైవీయూ
 
   జానమద్దిలాంటి మహోన్నత వ్యక్తి పరిచయం లభించడం పూర్వజన్మ సుకృతం. ఆయన మరణం వైవీ యూ ప్రగతికి, బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం అభివృది ్ధకి తీరని లోటు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం.         
 -ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్, ఉప కులపతి, వైవీయూ
 
  విదేశీయుడైనా బ్రౌన్ తెలుగుజాతికి మరువలేని సాహితీ సేవలు అందించగా, ఆయనను గుర్తుకు తెస్తూ మొట్టమొదటి స్మారక భవనాన్ని నిర్మించిన ఖ్యాతి జానమద్దిదే. -ఆచార్య టి.వాసంతి, కుల సచివులు, వైవీయూ
 
  జానమద్ది బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర నిర్మాణానికి చేసిన కృషి తెలుగుజాతి మరువలేదు. జిల్లా ప్రజల మనసులో ఆయన సుస్థిర స్థానం సాధించారు.
 -ఆచార్య ధనుంజయనాయుడు, ప్రిన్సిపాల్, వైవీయూ
 
  శిథిలమైపోతున్న తాళపత్ర గ్రంథాలను సంస్కరించి పుస్తకాలుగా ముద్రించడం ద్వారా డాక్టర్ జానమద్ది తెలుగుజాతికి చేసిన సేవను తెలుగు ప్రజలు మరవలేరు.
 -ఆచార్య ఎం.రామకృష్ణారెడ్డి,
 మాజీ కుల సచివులు, వైవీయూ
 
 రుణం తీర్చుకున్న రిమ్స్
 కడప కల్చరల్:జానమద్ది హనుమచ్ఛాస్త్రి రుణం రిమ్స్ తీర్చుకుంది. అవును వెనుకబడిన ప్రాంతంలో అత్యున్నత విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావిస్తే, అందులోని తొలిబ్యాచ్‌కు అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేసిన వ్యక్తి జానమద్ది.
 
 2006లో రిమ్స్ వైద్య విద్యార్థుల తొలిబ్యాచ్ ఫ్రెషర్స్‌డే రోజున ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులు అమూల్యమైన సూచనలు చేశారు.  కడప రిమ్స్ తొలిబ్యాచ్ వైద్యవిద్యార్థులు భావి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. 2014 సంవత్సరం వచ్చేకొద్ది అదే రిమ్స్ జానుమద్ధి బ్రౌన్ శాస్త్రికి చికిత్సలు  చేపట్టింది. రిమ్స్‌లో వైద్యులు, ఉద్యోగులు సుమారు అర్ధశతకం రోజులు తమ శాయశక్తులా సేవలందించా రు. రిమ్స్ వైద్యుల నుంచి మొదలు డెరైక్టర్ డాక్టర్ సిద్దప్పగౌరవ్ వరకూ ఎప్పటికప్పుడు అవసరమైన మందులు అందిస్తూ కంటికి రెప్పలా చూసుకోవడంతో రిమ్స్ తన రుణం తీర్చుకుందని సాహిత్యాభిమానులు పేర్కొంటున్నారు.
 
 జానమద్ది సాహిత్యసేవ అమూల్యం
 వైవీయూ:ప్రముఖ రచయిత, కవి, సీపీ బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపకులు జానమద్ధిహనుమచ్ఛాస్త్రి సాహిత్యసేవలు అమూల్యమైనవని వైవీయూ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అన్నారు. శుక్రవారం వైవీయూలోని సర్ సీవీ. రామన్ సమావేశమందిరంలో నిర్వహించిన జానమద్ది సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని తెలుగుసాహిత్యానికి మరిన్ని సేవలందించేలా బ్రౌన్ లైబ్రరీని అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం మౌనం పాటించి నివాళులర్పించారు.  
 
 కలెక్టర్లతో అనుబంధం  
 బ్రౌన్ శాస్త్రి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రికి పలువురు కలెక్టర్లతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. నిస్వార్థంగా సీపీ బ్రౌన్ పేరిట గ్రంథాలయాన్ని నెలకొల్పాలని, దాన్ని అత్యున్నత స్థాయికి చేర్చాలని ఆయన పడుతున్న తపనను గమనించిన అధికారులు ఆయనను ఎంతో గౌరవించేవారు.
 
 జిల్లాకు కలెక్టర్లకుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు పీఎల్ సంజీవరెడ్డి, జంధ్యాల హరినారాయణ, ఏకే ఫరీడా, రమణాచారి, జయేష్‌రంజన్, చంద్రమౌళి, అశోక్‌కుమార్,కృష్ణబాబు, శశిభూషణ్‌కుమార్, గిరిజాశంకర్, జయలక్ష్మి,  కాంతిలాల్‌దండేలు ఆయనను గురుభావంతో గౌరవించేవారు. అలాగే ఆయనకు రాష్ర్ట అధికారభాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన నాటి సి.నారాయణరెడ్డి నుంచి నేటి మండలి బుద్దప్రసాద్ వరకు ఆత్మీయమైన పరిచయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇంకాపలువురు సాహితీవేత్తలు, పుస్తక ప్రచురణ కర్తలతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి.
 
 జానమద్ది మృతికి సంతాపం
 సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతికి రాజంపేట ఎంపీ ఎ.సాయిప్రతాప్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను సాహిత్య కేంద్రంగా నిలిపేందుకు ఆయన చేసిన కృషి అనితర సాధ్యమన్నారు.  
 అంజాద్‌బాష నివాళి:వైఎస్సార్ సీపీ కడప నియోజకవర్గ కన్వీనర్ అంజాద్‌బాష శుక్రవారం జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతదేహాన్ని దర్శించి నివాళులర్పించారు.  ఆయనతోపాటు నాయకులు మాసీమబాబు, హరూన్‌బజాజ్ సంస్థ డెరైక్టర్ అహ్మద్‌బాష, అబ్దుల్ వాజిద్  నివాళి అర్పించారు. రాటా అధ్యక్షుడు శేషగిరి జానమద్ది మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు.
 
   బ్రౌన్ గ్రంథాలయం, భాషా పరిశోధన కేంద్రం ఏర్పాటులో డాక్టర్ హనుమచ్ఛాస్త్రి కృషి అనితర సాధ్యం.ఈ సంస్థలు ప్రజలకు ఎంతగా ఉపయోగపడితే బ్రౌన్ శాస్త్రి హృదయం అంతగా సంతోషిస్తుంది.    
 -శశిశ్రీ, వైవీయూ పాలక మండలి పూర్వ సభ్యులు
 
   సున్నిత హృదయం, సునిశిత అధ్యయనం గల జానమద్ది తెలుగుభాషకు చేసిన సేవ మరువరానిది. వారి బహుముఖ భాషా పాండిత్యం వల్ల తెలుగులో దాదాపు 30 గ్రంథాలు వచ్చాయి. జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా ఆయన చేసిన 20 ఏళ్ల కృషి జిల్లాను సాహితీ కేంద్రంగా నిలిపింది.
 -ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి,     బాధ్యులు, సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం.
 
   బ్రౌన్ శాస్త్రి జీవితం ఆంధ్ర సారస్వత లోకానికి ఆదర్శం. జిల్లా సంసృ్కతికి వారి ఆరు పదుల జీవితం ఒక ప్రత్యేక గుర్తింపును కల్పించింది. హిందీ, ఆంగ్లం, ఆంధ్ర భాషల్లో ఆయనకు గల అభినివేశం ఎన్నో వ్యాసాల రూపంలో వెలువడి తెలుగు సంస్కృతిని పరిపుష్ఠం చేశాయి     
 -విద్వాన్ కట్టా నరసింహులు,
 పూర్వ బాధ్యులు, సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, కడప.
 
  డాక్టర్ జానమద్ది సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రానికి చేసిన కృషి గొప్పది. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు.
 -పోచంరెడ్డి సుబ్బారెడ్డి,  మాజీ ఎమ్మెల్సీ
 
   సాహిత్య సేవా రంగాలలో జానమద్ది కృషి అనిర్వచనీయం. ఆయన దివంగతులైనా ఆయన మనస్సు సీపీ బ్రౌన్ గ్రంథాలయంలోనే పరిభ్రమిస్తూ దాని అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. -మలిశెట్టి జానకిరాం, పూర్వ సంయుక్త కార్యదర్శి, సీపీ బ్రౌన్ మెమోరియల్ ట్రస్టు
 
   డాక్టర్ జానమద్ది చరితార్థుడు. చరిత్రాత్మకుడు.  
 -ఆచార్య వకులాభరణం రామకృష్ణ
 
  డాక్టర్ హనుమచ్ఛాస్త్రి బ్రౌన్ మీదున్న గౌరవంతో యాచన చేయడానికైనా వెనుకాడని వ్యక్తి .-డాక్టర్ వీబీ సాయికృష్ణ , వెంకటగిరి
 
   కొత్తగా చూసే కళ్లకు బ్రౌన్ స్మారక గ్రంథాలయం మాత్రమే కనిపిస్తుంది. తెలిసిన కళ్లకు ఆనందాశ్రయుల మధ్య సార్థక స్వరూపి, స్నేహశీలి, అనంతానంత ఆకారుడైన ఒక వయోవృద్ధుడు చిరునవ్వుతో కనిపిస్తాడు. ఆ వ్యక్తే జానమద్ది హనుమచ్చాస్త్రి,
 - పి.రామకృష్ణారెడ్డి, ప్రముఖ కథా రచయిత, హైదరాబాద్.
 
    డాక్టర్ జానమద్ది సారథ్యంలో జిల్లా రచయితల సంఘం, బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం లభించింది. ఆయన నాకు నిత్య స్మరణీయుడు.     
 - ఎన్‌సీ రామసుబ్బారెడ్డి,
 వ్యవస్థాపక సభ్యుడు, బ్రౌన్ మెమోరియల్ ట్రస్టు.
 
 డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక లేరన్న వార్త నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆంగ్ల దొర బ్రౌన్ తెలుగుభాషకు చేసిన సేవలను నేటితరానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి  జానమద్ది. ఆయన తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలు మరువలేనివి.- డాక్టర్ రమణాచారి, మాజీ ఐఏఎస్ అధికారి
 
   డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం ఏర్పాటు, అబివృద్దికి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకోవాలి. గ్రంథాలయ ప్రాంగణంలో ఆయన శిలా విగ్రహాన్ని వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తేనే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారవుతాం.
 - జనార్దన్ పురాణిక, బ్రౌన్ శాస్త్రికి ఆప్త శిష్యుడు
 

మరిన్ని వార్తలు