‘బ్రౌన్ శాస్త్రి’ జానమద్ది కన్నుమూత

1 Mar, 2014 01:50 IST|Sakshi
‘బ్రౌన్ శాస్త్రి’ జానమద్ది కన్నుమూత

సాక్షి, కడప: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం ఉదయం కడప రిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. డిసెంబర్ చివరివారంలో అస్వస్థతకు గురైన ఆయన మొదట హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయన్ను కడప రిమ్స్‌లో చేర్చారు. దాదాపు రెండు నెలలు కోమాలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం 6.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలోని పలు ముఖ్య కూడళ్ల ద్వారా ఊరేగింపుగా రామకృష్ణ జూనియర్ కళాశాల వద్దగల స్మశాన వాటికకు చేర్చారు.  బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 1925 అక్టోబర్ 10న హనుమచ్ఛాస్త్రి జన్మించారు. తండ్రి సుబ్బన్న, తల్లి జానకమ్మ. కడపజిల్లా రచయితల సంఘం వ్యవస్థాపనలో, బ్రౌన్ గ్రంథాలయ రూపకల్పనలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన కృషికి మెచ్చిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి ‘బ్రౌన్ శాస్త్రి’ అని పిలిచేవారు. ఆయన ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ‘ఎందరో మహానుభావులు’ పేరిట వ్యాసాలు రాశారు.


 కన్నడం, ఆంగ్లం, అనువాదాలతో కలిపి ఆయన మొత్తం రెండున్నర వేల వ్యాసాలు రాశారు. సాహిత్య అకాడమీ సభ్యుడిగా వ్యవహరించారు. మొత్తం 22 పుస్తకాలు వెలువరించారు. 8వ తరగతి తెలుగు వాచకంలో బళ్ళారి రాఘవపై ఆయన రచనను పాఠంగా ఉంచారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లోనూ ఆయన రచనలు పాఠాలుగా ఉండటం విశేషం. బ్రౌన్ గ్రంథాలయ ప్రారంభోత్సవ సందర్భంగా 1995 నవంబర్ 29న నాటి సీఎంచే సత్కారం, 1996 జనవరి 25న నాటి భారత ప్రధాని పీవీ నరసింహారావుచే సత్కారం పొందారు. 1999లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినారె, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర నేతలు తెలకపల్లి రవి, వరప్రసాద్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాజీ సలహాదారు కేవీ రమణాచారి తమ సంతాపాన్ని తెలిపారు.
 
 కోర్ కమిటీ భేటీలో ‘ఆర్డినెన్స్’లపై చర్చ...
 
 
 సాక్షి, న్యూఢిల్లీ: శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 వరకు ప్రధాని  మన్మోహన్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యులతో కూడిన కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ప్రధానితో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, రక్షణమంత్రి ఆంటోని, ఆర్థికమంత్రి చిదంబరం, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ అంశాలు చర్చించేందుకు మంత్రులు కపిల్‌సిబల్, జైరాంరమేశ్, మల్లికార్జునఖర్గే, నారాయణసామి కూడా హాజరయ్యారు. ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు మరోసారి కేబినెట్ భేటీ అయ్యి ఆమోదించాల్సిన అంశాలపై చర్చించారు. అవినీతి వ్యతిరేక బిల్లులకు సంబంధించిన కొన్ని ఆర్డినెన్స్‌లు తేవాలా వద్దా అన్న అంశంపై లోతుగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు మరొక ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న తెలంగాణ బిల్లుకు నేడో రేపో ఆమోదముద్ర పడే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
 

మరిన్ని వార్తలు