చంద్రబాబుకు నా రాజకీయం చూపుతా

28 Mar, 2019 09:12 IST|Sakshi
ఒంగోలు సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌ 

ప్రత్యేక హోదాను టీడీపీ గాలికొదిలేసింది

అధికార పార్టీ అవినీతి అక్రమాలతో విసిగిపోయాం

 ఒంగోలు సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌

సాక్షి, ఒంగోలు అర్బన్‌: తనకు రాజకీయాలు తెలియవని విమర్శించిన సీఎం చంద్రబాబుకు తన రాజకీయం ఏమిటో చూపుతానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిస్తే తనపైనే దాడులు చేయించారని మండిపడ్డాడు. బుధవారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన రాత్రి 8 గంటల సమయంలో ఒంగోలు నగరానికి చేరుకున్నారు. అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మద్దతు తెలిపి అధికారం ఇప్పించిన తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి, అక్రమాలతో ఈ ఐదేళ్లూ విసిగిపోయామన్నారు.

టీడీపీ ప్రత్యేక హోదాను గాలి కొదిలేసిందని, అందుకే ఈసారి మద్దతు ఇవ్వకుండా సొంతగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. అవినీతి సంపాదనతో వచ్చిన వేలాది కోట్లతో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.  తమ పార్టీ అధికారంలోకి వస్తే 18 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. తాను అధికారింలోకి వస్తే జిల్లాలో ఒంగోలు గిత్తల అభివృద్ధి, వ్యవసాయానికి వెయ్యి కోట్లు కేటాయిస్తానన్నారు. యువ రైతులను తయారు చేస్తానని 6 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు.బాల్యంలో ఒంగోలులో ఉన్నానని జిల్లాను సొంత జిల్లాగా భావించి అభివృద్ధి చేస్తానని అన్నారు. జనసేన అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.

డబ్బు, వారసత్వ రాజకీయాలను పారదోలాలని జనసేన సామాన్యులకు పట్టం కట్టిందని పవన్‌ పేర్కొన్నారు. జిల్లాలో జనసేన కూటమి తరుపున సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీ అభ్యర్ధులను గెలిపించి సామాన్యులు రాజకీయాల్లోకి రావాలనే సంకేతం ఇతర పార్టీలకు తెలపాలని పిలుపునిచ్చారు. సభలో జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు