ఓట్లు చీల్చడానికే పవన్‌ కుట్ర

2 Apr, 2019 08:46 IST|Sakshi
భీమవరం సభలో ప్రసంగిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌

సాక్షి, భీమవరం: చంద్రబాబు పాలనతో ప్రజలతో విసిగిపోయారని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి తెలుగుదేశంపార్టీకి అండగా ఉండడానికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పాకులాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భీమవరం నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. సోమవారం భీమవరం బస్టాండ్‌సెంటర్‌లో నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో శ్రీనివాస్‌ మాట్లాడారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు)పదేళ్లుగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని ప్రశ్నిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న వపన్‌కల్యాణ్‌ భీమవరం అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ అరాచకల గురించి మాట్లాడకుండా తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలను మోసం చేయడానికి పసుపు–కుంకుమ అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారని, జగన్‌ ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీచేయడమేగాక వడ్డీలేని రుణాలు అందిస్తారని దీనిని మహిళలంతా గ్రహించాలన్నారు. గత ఎన్నికల హామీల్లో చంద్రబాబు ఏ ఒక్కటీ పూర్తిగా అమలుచేయలేదని, ప్రస్తుత ఎన్నికల్లో విమానాలు సైతం ఉచితంగా ఇస్తామంటూ ప్రజలను మోసగించడానికి ప్రయత్నంచేస్తున్నారని శ్రీనివాస్‌ విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి దోచేశారని, మళ్లీ అధికారం ఇస్తే ఇక ఏమీ మిగల్చరని దుయ్యబట్టారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు కాక విద్యార్థులు  నష్టపోవడమేకాక అనేక విద్యా సంస్థలు మూతదశకు చేరాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చడానికే జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రకటించారని, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. 


బాబు పోతేనే జాబు : రఘురామకృష్ణంరాజు 
నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ  23 పర్యాయాలు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలవలేకపోయిన చంద్రబాబునాయుడి వంటి అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అనే ఒక వ్యక్తి ఉద్యోగం పోతే.. ఆ తర్వాత రాష్ట్రంలో వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, దానికిగాను టీడీపీని చిత్తుగా ఓడించాలని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలకు పూర్తిస్థాయి రుణ మాఫీ చేయకుండా పసుపు–కుంకుమ పేరిట మోసగిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చే రూ.10వేల గురించి మోసపోకుండా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఒనగూరే డ్వాక్రా రుణ మాఫీ గురించి ఆలోచించాలని కోరారు. జగన్‌ అధికారంలోకి వస్తే జిల్లా వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

భీమవరం ప్రాంతాన్ని ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేయడమేకాక ఆక్వా రంగంలో పనిచేసే మహిళలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. భీమవరం పట్టణంలో రీల్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ కంటే రియల్‌ హీరో గ్రంధి శ్రీనివాస్‌ వల్లే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మాకు నటించడం రాదు ప్రజలతో మమేకం కావడమే తెలుసునన్నారు. సభలో పార్టీ ఉండి, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు పీవీఎల్‌ నర్సింహరాజు, ముదునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ, నరసాపురం, ఉండి మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పాతపాటి సర్రాజు, ఏఎస్‌ రాజు, వేండ్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, కె.కృష్ణ శ్రీనివాస్, మంతెన యోగీంద్రకుమార్, గాదిరాజు సుబ్బరాజు, కామన నాగేశ్వరరావు, పేరిచర్ల విజయనర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు.


వైఎస్సార్‌సీపీలో చేరికలు
భీమవరంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగసభలో తోట భోగయ్య, పారిశ్రామికవేత్త అవినాష్‌వర్మ, బీసీ సంఘం నాయకురాలు చంద్రకళ తదితరులు చేరారు. వీరికి జగన్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. 

 

మరిన్ని వార్తలు