ఏపీ సర్కారుకు జనసేన పార్టీ డిమాండ్లు

22 Jan, 2017 12:05 IST|Sakshi
ఏపీ సర్కారుకు జనసేన పార్టీ డిమాండ్లు

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతులు కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయంకాదని జనసేన పార్టీ అభిప్రాయపడింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ట్రాన్ స్టాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్న వివేకం కూడా చూపకపోతే ఎలా అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై పవన్ వరుస ట్వీట్లలో లేఖాస్త్రాలు సంధించారు.

పోలవరం ప్రాజెక్ట్ పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్‌గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజా ప్రతినిధులు చెప్పాలని  లేఖలో డిమాండ్ చేశారు.  పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోసారి సమీక్ష జరుపుతున్న ఏపీ సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. 'ఈ భూముల రైతులు తమ వారు కాదనా.. లేక కాంట్రాక్టర్‌కు ఇబ్బందనా.. గత్యంతరం లేని రైతులు తగిన నష్ట పరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరు. పోవలరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారు. ఇది అన్యాయమని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారు. ఇది మంచిదికాదు. ఇకనయినా వారికి అన్యాయం చేయండి తాము దళితులం అయినందువల్లే నష్ట పరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు' అని పవన్ సూచించారు.

'అసలు గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనల ప్రకారం నది పరివాహకంలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదు. ఈ భూములను తీసుకుని ఏమి చేస్తారో ప్రజలకు, కనీసం రైతులకైనా తెలియచేయాలి. భూముల సేకరణకు ముందు ఎంతమేరకు నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో.. అంత ఇవ్వాలి. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా ఇచ్చి వివక్షత పాటించడం మంచిది కాదు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని' జనసేన పార్టీ డిమాండ్ చేసింది.
(చదవండి: ఏపీ నేతలపై ఎన్నో సందేహాలు: పవన్)