నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు..?

12 Aug, 2017 11:44 IST|Sakshi
నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు..?

► సూక్ష్మపోషకాల పంపిణీపై వివాదం
► ఎంపీఈఓపై జన్మభూమి కమిటీ సభ్యుడి దౌర్జన్యం


ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీల సభ్యుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిబంధనల మేరకు  సూక్ష్మపోషకాలను పంపిణీ చేసిన ఎంపీఈఓపై  జన్మభూమి కమిటీ సభ్యుడు దాదాగిరీ చేశాడు. ‘‘ఏరా..? నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు’’ అంటూ నానా దుర్భాషలాడుతూ కొట్టినంత పని చేశాడు. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది కన్నీటి పర్యంతమవుతూ తమగోడును విలేకరులతో వెల్లబోసుకున్నారు.

ఇంతకీ ఏంజరిగిందంటే...
ధర్మవరం మండలం ఓబుళనాయునపల్లి గ్రామానికి మంజూరైన జిప్పం, బోరాన్, జింక్‌ తదితర మైక్రో న్యూట్రిన్స్ ను గురువారం అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ పద్ధతిన ఎంపీఈఓ పోతులయ్య శుక్రవారం పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుడు శ్రీరాములు అక్కడి వచ్చి ఎంపీఈఓపై దౌర్జన్యం చేశాడు. తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా... పట్టించుకోలేదు. ‘‘ అంతా మీఇష్టమైతే మేమెందుకు.. మీరు ఏమి పని చేసినా, ఎవరికి ఏమి ఇవ్వాలన్నా మాకు చెప్పాలి’’ అంటూ నానా దుర్భాషలాడారన్నారు.

అదంతా తమకు తెలియదని ఏదైనా ఉంటే ఉన్నతాధికారులను అడగాలని ఎంపీఈఓ సమాధానమివ్వడంతో కోపోద్రిక్తుడైన జన్మభూమి కమిటీ సభ్యుడు ఎంపీఈఓ పోతులయ్య గొంతుపట్టుకుని భౌతిక దాడికి యత్నించాడు. ప్రత్యేక అవసరాలుకలి్గన వ్యక్తి అన్న కనీస మర్యాద పాటించకుండా ఇలా దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

పెత్తనం భరించలేకపోతున్నాం
విలేకరులతో మాట్లాడిన పలువురు ఎంపీఈఓలు జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనాన్ని భరించలేకపోతున్నామని, ప్రతి చిన్న విషయం వారికే చెప్పాలని, లేదంటే నానా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. గురువారం ఉదయం రావులచెరువు గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఒకరు తనకు ఇన్పుట్‌ సబ్సిడీ పడలేదని నానాదుర్భాషలాడారని ఓ మహిళా ఎంపీఈఓ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి సదరు రైతుకు రెండు చోట్ల భూమి ఉండటంతో అటువంటి వారి వివరాలు అన్నీ జేడీ కార్యాలయానికి పంపామని, అక్కడి నుంచి వారికి అనుమతి లభించాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోకుండా... ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాదని ఆమె తెలిపింది.

మరిన్ని వార్తలు