ప్రోగ్రెస్ నిల్

17 Nov, 2014 04:06 IST|Sakshi

మచిలీపట్నం :జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం గత నెల అక్టోబరు రెండో తేదీన ప్రారంభమై ఈ నెల 11తో ముగిసింది. తుపాను కారణంగా అక్టోబరు 12 నుంచి ఆ నెలాఖరు వరకు వాయిదా వేశారు. నవంబరు ఒకటి నుంచి 11 వరకు రెండో విడత నిర్వహించి పూర్తిచేశారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ జన్మభూమి-మా ఊరు పేరుతో నిర్వహించగా, ఆ పార్టీ నేతలు దీనిని పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చివేశారు. జన్మభూమిలోనే పింఛన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో అవి నిలిచిపోయాయి.
 
970 పంచాయతీలు.. 277 వార్డుల్లో...
జిల్లాలో జన్మభూమి - మా ఊరు సభలు 970 పంచాయతీల్లో, 277 వార్డుల్లో నిర్వహించారు. 2.77 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా నవంబరు 11 నాటికి 2,26,998 మందికి పంపిణీ చేశారు. మిగిలిన వారికి తరువాత రోజుల్లో ఇచ్చారు. తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారికి గృహాలకు వెళ్లి పింఛన్లు అందజేస్తామని అధికారులు ప్రకటించారు. నవంబరు 11 నాటికి రూ.23.61 కోట్లను పింఛను రూపంలో అందజేశారు.

మండలాలు, ఆయా పురపాలక సంఘాల్లో 1,247 గ్రామసభలు నిర్వహించగా వాటిలో 1,241 వైద్యశిబిరాలను నిర్వహించారు. 1,18,898 మందికి వైద్యపరీక్షలు చేశారు. 1,085 పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 90,245 పశువులకు పరీక్షలు చేసి మందులు అందజేశారు. భూసార పరీక్షలకు సంబంధించి రైతులకు 12,758 సాయిల్ హెల్త్‌కార్డులను అందజేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు 1,058 అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు.

జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గృహనిర్మాణం, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరుతూ 5,12,166 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. బడి ఈడు ఉండి అసలు బడికి వెళ్లని ఏడుగురు బాలలను గుర్తించారు. గృహాలు, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరుతూ 1,70,290 దరఖాస్తులు వచ్చాయి.
 
నిధుల విడుదలపై స్పష్టత లేదు...
జన్మభూమిలో వచ్చిన దరఖాస్తులు, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. అభివృద్ధి పనులకు సంబంధించి ఏ విభాగం నుంచి నిధులు కేటాయించాలనే అంశంపై ఇంతవరకు స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. నూతన పింఛన్ల మంజూరు పైనా ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే తదుపరి నిర్ణయం తీసుకోగలమని అధికారులు చెబుతున్నారు.

ప్రచారానికే ప్రాధాన్యం
జన్మభూమిని ఆద్యంతం పార్టీ ప్రచార కార్యక్రమంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తలకే నాయకులు, కార్యకర్తలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పింఛను మంజూరు పత్రాలను అందజేసే సమయంలో పసుపు రంగులో ప్రత్యేకంగా తయారు చేయించిన కవర్లపై ముఖ్యమంత్రి, స్థానిక మంత్రి, ఎమ్మెల్యే తదితరుల ఫొటోలను ముద్రించి ఇచ్చారు. గర్భిణులకు సీమంతం పేరుతో వారికి ఇచ్చే పూలు, గాజులు, చీరతో పాటు చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన పత్రాలు అందజేశారు.

సీమంతం కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఏదైనా గ్రామంలో లేదా వార్డులో జన్మభూమి కార్యక్రమం జరిగితే అంగన్‌వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రముఖుల నుంచి చందాలు వసూలు చేసి ఈ తంతు ముగించారు. జన్మభూమి నిర్వహణ కోసం పంచాయతీకి, వార్డుకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వాటిని జన్మభూమి కార్యక్రమం పూర్తయ్యే సమయంలో అధికారులు విడుదల చేయటం గమనార్హం.
 
అధికారులే టీడీపీ కార్యకర్తలుగా...
చాలా గ్రామాల్లో అధికారులే టీడీపీ కార్యకర్తలుగా మాదిరిగా వ్యవహరించి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. బందరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఎలాంటి పదవులూ లేని టీడీపీ నాయకులు వేదికపై నుంచి ప్రసంగించేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద నిర్వహించాలనే నిబంధన ఉన్నా బందరు మండలం గుండుపాలెంలో టీడీపీ కార్యకర్తల సూచనల మేరకు జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఏర్పాటు చేయటం వివాదాస్పదమైంది.
 
పలువురు నేతల అత్యుత్సాహం...
జన్మభూమి సభల్లో పలువురు టీడీపీ నేతల అత్యుత్సాహం వివాదాస్పదమైంది. పామర్రు మండలం కొమరవోలు, రిమ్మనపూడి పంచాయతీలో టీడీపీ నేత వర్ల రామయ్య వ్యవహరించిన తీరు ఆ గ్రామాల ప్రజల మధ్య చిచ్చుపెట్టింది. కొమరవోలు పంచాయతీలో పింఛను సర్వేలో భాగంగా గ్రామకమిటీ సభ్యులు 50 మందికి అకారణంగా పింఛన్లను తొలగించారు. దీనిపై ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో పోలీసు బలగాలను దింపి ఇక్కడ జన్మభూమి నిర్వహించారు.

స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య తదితరులు మళ్లీ ఇక్కడ జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించటం వివాదాస్పదమైంది. రిమ్మనపూడిలో టీడీపీ నాయకులను వేదిక ఎందుకు ఎక్కనిచ్చారంటూ గ్రామస్తులు తిరగబడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా ఉన్న సర్పంచులు, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ఉన్న మండలాల్లో వారిని పక్కనపెట్టి టీడీపీ నాయకులు, కార్యకర్తలే తమ పెత్తనం చెలాయించేందుకు జన్మభూమిని వేదికగా వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.

టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మహిళలు ఉన్నచోట్ల వారి భర్తలే అన్నీ తామై వ్యవహరించారు. టీడీపీకి చెందిన గ్రామ, మండల, పట్టణస్థాయి నాయకులంతా జన్మభూమి వేదికలపై నుంచి గంటల తరబడి ప్రసంగించారు. ప్రభుత్వం తమదేనని, తాము చెప్పిందే జరుగుతుందనే ధోరణిలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించటం గమనార్హం.

మరిన్ని వార్తలు