‘జన్మభూమి’లో ప్రభుత్వాన్ని నిలదీయండి

21 Sep, 2014 03:25 IST|Sakshi
‘జన్మభూమి’లో ప్రభుత్వాన్ని నిలదీయండి

 భీమవరం :  రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి ప్రారంభించనున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలోని ఆనంద ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ శ్రేణుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తానని రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించాడన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే వరకు టీడీపీ సర్కారును ప్రజలు నిలదీయాలని కోరారు. నిరుద్యోగులకు భృతి, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు ఏమయ్యాయో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆదర్శ రైతులను, వివిధ శాఖల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి ఉద్యోగుల కడుపు మీద కొట్టారన్నారు.
 
 అటువంటి వారంతా జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులపై ఒత్తిడి తేవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆధార్‌కార్డుతో అనుసంధానం పేరుతో వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులను ఏరివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అర్హులను తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌దే కాదు రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదని,   ఇతర పార్టీలకూ భాగం ఉందన్నారు. దీన్ని ప్రజలకు వివరించడంలో విఫలం చెందామని, ఇకనైనా కార్యకర్తలంతా ఆగ్రహావేశాలు వీడి కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు శ్రమించాలని రఘువీరారెడ్డితో పాటు ఆ పార్టీ అగ్రనేతలు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు కృషి చేయాలన్నారు.
 
 కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు సాగాలి
 కేంద్ర మాజీ మంత్రి కె.చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కనీస స్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు వస్తాయని ఆశించామని, అయితే ఇంతదారుణంగా ఫలితం ఉంటుందని ఊహించలేదన్నారు. కార్యకర్తలంతా మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాల మాయమాటలను, మోసపూరిత విధానాలను  గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ర్ట విభజనలో కాంగ్రెస్‌ని దోషిగా చేశారని విభజన వెనుక టీడీపీ అనే శక్తి బలంగా పనిచేసిందన్నారు. మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గోదావరి వలె నిత్యం కళకళలాడుతూ ఉంటుందన్నారు.
 
 ఎమ్మెల్సీలు కంతేటి సత్యనారాయణ రాజు, రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలతో సాగుతున్న టీడీపీ పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉండి లబ్ధిపొందిన నేతలు, కార్యకర్తలంతా పార్టీని వీడటం బాధాకరమని చెప్పారు. అనంతరం కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా నేతలంతా సమీక్షించారు. వారి కష్టాలు,  పార్టీ స్థితిగతులను తెలుసుకుని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమాలోచనలు చేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గంగాభవాని, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గాదేవి, మాజీ ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, గిడుగు రుద్రరాజు,  డీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, కలవకొలని నాగతులసీ రావు, కత్తుల సత్యప్రసాద్, గాదిరాజు లచ్చిరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ రాము (చేపల రాము), పట్టణ అధ్యక్షుడు ఉండవల్లి రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు