తిన్నది ఎవరో తెలవడం లేదు..?

18 Jun, 2019 10:13 IST|Sakshi

సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : మండలంలో టీడీపీ ప్రభుత్వం ప్రచార యావతో నిర్వహించిన జన్మభూమి సభల నిర్వహణ నిధులు ఇటీవలే విడుదలయ్యాయి. కానీ వాటిని ఇప్పటికీ పంచాయతీలకు పంపిణీ చేయలేదు. ఆ నిధుల ఖర్చులో మండల పంచాయతీ అధికారి చేతివాటం చూపినందునే పంపిణీ జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వం 2019 జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి సభలు నిర్వహించింది. అప్పట్లో దీనికోసం నిధులు వెంటనే ఇవ్వలేదు. దాంతో పంచాయతీ కార్యదర్శులే చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో కార్యదర్శుల పైనే ఈ భారం పడింది. ప్రతీ గ్రామంలో సభ కోసం 3 షామియానాలు, 500 కుర్చీలు, బల్లలు, వాటర్‌ బాటిళ్లు, ప్యాకెట్లు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, సభ నిర్వహణపై ముందురోజు ఆటోలతో ప్రచారం, వైద్య శిబిరాలు ఉన్న చోట వాటికి ప్రత్యేకంగా షామియానాల ఏర్పాటు.. ఇలా ఒక సభ నిర్వహణకు తడిసిమోపెడు ఖర్చులయ్యాయి. ఇవన్నీ అయ్యాక అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భోజనాలకు అదనంగా మరింత ఖర్చు అయింది.

సభకు రూ.20 నుంచి రూ.25వేల వరకు ఖర్చు..
సభల నిర్వహణ కోసం ఒక్కోదానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు అయినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఇటీవల పంచాయతీకి రూ.5వేల చొప్పున 22 పంచాయతీలకు రూ.1.10 లక్షలు విడుదల చేసినట్లు పంచాయతీ అధికారి రికార్డుల్లో నమోదు చేసినట్లు ఉంది. కానీ ఒక్క రూపాయి కూడా మాకు అందలేదని కార్యదర్శులు చెబుతున్నారు. వాటి కోసం ఎంపీడీఓను కార్యదర్శులు అడగ్గా ఆయన ఈఓపీఆర్‌డీకి చెక్‌ రాసి ఇచ్చానని, ఆయన్నే ఆడగాలని సూచించారు. ఈఓపీఆర్‌డీని అడగ్గా పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు కార్యదర్శులు చెబుతున్నారు. ఈఓపీఆర్‌డీ చేతివాటం చూపినట్లు కార్యదర్శులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు