‘జన్మభూమి’లో తరిద్దాం

30 Sep, 2014 01:54 IST|Sakshi
‘జన్మభూమి’లో తరిద్దాం
  • మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
  • సాక్షి, విజయవాడ : త్వరలో జరగనున్న జన్మభూమి కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అమ్మ కళ్యాణమండపంలో  పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

    ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దేవినేని ఉమా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని, గతంలో రూ.200 ఇచ్చిన ఫించన్లు ఇప్పుడు రూ.1000కు పెంచామని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.  ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై పార్టీ దృష్టి ఉంటుందని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. త్వరలోనే మండలస్థాయి, గ్రామస్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

    బీసీ సంక్షేమశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించారని, వారి ఆశలకు తగిన విధంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఎంపీ కొనగళ్ల నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ హాయాంలో దేశం అవినీతి మయమైపోయిందన్నారు. రూ.80 కోట్ల నిధులు మచిలీపట్నం  పోర్టుకు రాబోతున్నాయని తెలిపారు.  ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన  అవసరం  ఉందని అన్నారు.
     
    దేశం నేతలు, కార్యకర్తల్లో అసహనం...

    అధికారంలోకి వచ్చిన తరువాత తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు, కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయం విస్తృతస్థాయి సమావేశంలో బయట పడింది. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా  దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తల్ని పట్టించుకోవాలని కోరారు. అధికారులు కార్యకర్తలకు ఏమాత్రం ప్రాధాన్యత  ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
     
    నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు వచ్చేలాగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు.  సమావేశంలో కార్యకర్తలు ఇబ్బందులు చెప్పుకునేందుకు అవకాశం కల్పించాలంటూ వైవీబీ సూచించగా,   సభకు అధ్యక్షత వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు  అసహనం వ్యక్తం చేశారు. కాగా ఇంతకాలం తాము పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు కొత్తవారు అందలాలు ఎక్కుతున్నారంటూ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, తిరువూరు ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్, మాజీ అధ్యక్షుడు కడియాల రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు