జన్మమెత్తితిరా!

4 Jan, 2015 03:27 IST|Sakshi
జన్మమెత్తితిరా!

సాక్షి, కర్నూలు: హమీలతో హడావుడి చేయడం.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడం.. ఆ తర్వాత మరో కొత్త రాగం అందుకోవడం చంద్రబాబుకే చెల్లు. తొలి సంతకం సాక్షిగా ఆయన రుణమాఫీ రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ముఖ్యమంత్రి.. ఇప్పటికీ ఆ పంథా వీడకపోవడం గమనార్హం. ‘జన్మభూమి-మాఊరు’ పేరిట ప్రజలకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా.. ఆ సందర్భంగా తీసుకున్న దరఖాస్తులను కూడా బుట్టదాఖలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

దాదాపు నెలన్నర రోజులు దాటినా వీటి గురించి పట్టించుకోకపోవడం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోంది. సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం.. జిల్లా అధికారులు స్పందించకపోవడంతో జన్మభూమి దరఖాస్తులు నెలన్నర రోజులుగా దుమ్ముపట్టిపోయాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమమే జన్మభూమి-మా ఊరు. ఆ నమ్మకంతోనే ప్రజలు తమ సమస్యలపై భారీగా వినతులు అందించారు.

పాలనలో జవాబుదారీతనం పెంచేందుకంటూ దరఖాస్తులను ఆన్‌లైన్ చేయించి.. పరిష్కారమైన తర్వాత ఆ వివరాలు అందులో పొందుపర్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆన్‌లైన్ చేసేలోపే పుణ్యకాలం గడిచిపోయింది. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లాలోని 889 గ్రామాల్లోనూ, 219 పట్టణ ప్రాంత వార్డులోనూ గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,108 సభల్లో ఏకంగా 3,27,053 వినతులు అందగా.. 50 రోజులు దాటిపోయినా వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

అధిక శాతం దరఖాస్తులు హౌసింగ్ శాఖకే
జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపన పత్రాల్లో హౌసింగ్ శాఖకు సంబంధించినవే అత్యధికంగా ఉన్నాయి. ఈ శాఖకు 92,144 అర్జీలు అందగా.. 61,738 దరఖాస్తులతో రెవెన్యూ శాఖ ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇక రేషన్‌కార్డుల కోసం 60,269, పింఛన్ల కోసం 47,836, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 4,241, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు 2,839 దరఖాస్తులు అందజేశారు. ఇవే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, పురపాలకశాఖకు సంబంధించి మరిన్ని అర్జీలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల వివరాలు
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఇప్పటి దాకా ఆన్‌లైన్ మాత్రమే చేయగలిగారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అందిన 2,04,884 దరఖాస్తుల్లో 2,01,654 మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 1,22,169 దరఖాస్తులకు గాను ఇప్పటి వరకు 1,18,440 అర్జీలు అప్‌లోడ్ చేశారు. సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కారంలో భాగంగా దరఖాస్తుదారుల నుంచి వివరాల సేకరణ, సంబంధిత సమాచారం వారికి తిరిగి తెలియజేసేందుకు వీలుగా ఆధార్ నెంబరు, ఫోన్ నంబర్లు సైతం అప్‌లోడ్ చేశారు. అయితే ఎప్పటికి పరిష్కారం చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
అన్నింటినీ పరిష్కరిస్తాం

జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అందిన దరఖాస్తులు అన్నింటినీ పరిష్కరిస్తాం. గ్రామసభల్లో దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాం. ప్రభుత్వం తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. రేషన్‌కార్డులు, పింఛన్లకు సంబంధించి సమస్యల్ని నెల రోజుల్లోపు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. రెవెన్యూ, హౌసింగ్‌లకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి కాస్త సమయం పట్టొచ్చు.                                
  - సీహెచ్ విజయమోహన్, జిల్లా కలెక్టర్

హమీల, చంద్రబాబు, బుట్టదాఖలు,

 

మరిన్ని వార్తలు