జవాన్ ఉద్యోగాలకు 1300 దరఖాస్తులు

22 Feb, 2015 00:06 IST|Sakshi

23న పరుగుపందెం ఎంపికైన వారికి ఉచిత శిక్షణ
పాడేరు ఏఎస్పీ బాబూజీ

 
పాడేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్న 63 వేల జవాన్ పోస్టులకు సంబంధించి తమ కార్యాలయం ద్వారా 1300 మంది గిరిజన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని పాడేరు ఏఎస్పీ ఎ.బాబూజీ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతు పాడేరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో జవాన్ పోస్టులకు యువతీ, యువకులంతా ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్ని వసతులతో కూడిన ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఈ నెల 23 నుంచి 5 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. పాడేరు, హుకుంపేట మండలాలకు సంబంధించిన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల అభ్యర్థులకు 24న, మిగిలిన అభ్యర్థులకు 25న  పరుగు పందెం పోటీలు పాడేరులో నిర్వహిస్తామన్నారు.

పరుగు పందెం పోటీలు పైతేదిల్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా ఈ పరుగుపందెం పోటీలకు గాను కుల, టెన్త్ ధ్రువపత్రం, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. పరుగు పందెం పోటీల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నెల రోజులపాటు అన్ని వసతులతో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌తోపాటు షూ, భోజన వసతి, వైద్యసౌకర్యాలు ఉంటాయన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు కేవలం జవాన్ పోస్టులకే కాకుండా కానిస్టేబుళ్లు, టీచర్లు, వీఆర్వో, వీఆర్‌ఏ, గ్రూప్ 4, ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయని ఏఎస్పీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు