సరిహద్దు శిఖరం.. బతుకు సమరం

26 Jul, 2018 11:11 IST|Sakshi

మాజీ సైనికుల కన్నీటి వ్యథ

భూములను ఆక్రమిస్తున్న కబ్జారాయళ్లు

సమాజంలో గుర్తింపులేని సేవలు

న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణ

చనిపోతే తప్ప లభించని గౌరవం

నేడు కార్గిల్‌ విజయ్‌ దివస్‌  

తల్లిదండ్రులు.. భార్యాపిల్లల మంచీచెడును దగ్గరుండి చూసుకునే అవకాశం లేకపోయినా.. దేశ ప్రజలే కుటుంబంగా భావించే ధీరులకు కనీస రక్షణ కరువైంది. వీర మరణంతో సొంతూళ్లకు చేరుకునే పార్థివ దేహాలకు సెల్యూట్‌ చేస్తున్న చేతులు.. ఉగ్రమూకల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచి సొంత సమస్యలపై అధికారుల ఎదుట నిలుచుంటే చేయూతనివ్వని దయనీయం. సార్‌.. నా భూమి ఆక్రమణలో ఉందని పోలీసుల కాళ్లావేళ్లా పడితే.. తుపాకీ చూపించావంటూ బీఎస్‌ఎఫ్‌ జవాను నాగరాజును రెండు రోజుల క్రితం కటకటాల్లోకి నెట్టేశారు. అదే జవానుపై దాడికి దిగిన వ్యక్తులు రాజకీయ, పోలీసు అండదండలతో దర్జాగా బయట తిరుగుతున్నారు. ‘సాక్షి’ కథనం కదిలించినా.. ఆ జవాను బెయిలుపై తిరిగొచ్చి ఫిర్యాదు చేస్తే అప్పుడు కేసు కడతామన్న సాటి ఖాకీల కఠిన హృదయానికి సభ్య సమాజం జోహార్లు అర్పిస్తోంది.

ఎముకలు కొరికే చలి.. జోరువాన..ఠారెత్తించే ఎండ.. ఏదైనా భరిస్తారు.కుటుంబం..పిల్లలు..బంధువులు..దేన్నైనా త్యజిస్తారు.సరిహద్దును రక్షిస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటారు.దేశంకోసం ప్రాణాన్నే ఫణంగా పెడతారు.కొందరు అమరులవుతారు..మరికొందరు మాజీ సైనికులవుతారు..కానీ.. ఇంటికొచ్చిన ఆ వీరులను ఈ సమాజం దగాచేస్తోంది. పదవీ విరమణ పొందాక ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు, నేతలు అక్రమాలకే అండగా నిలుస్తున్నారు. అందుకే సరిహద్దులో శిఖరంగా కనిపించిన సైనికుడు.. సమాజంలోనిశ్చేష్టునిగా మారిపోతున్నాడు. కనిపించిన వారినంతా న్యాయం కోసం వేడుకుంటున్నాడు. ప్రతి కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రోజూ మాజీ సైనికులకు దండంపెట్టే వ్యక్తులే.. ఆ తర్వాత వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇలా మాజీ సైనికులు ఎదుర్కొంటున్నభూ సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.       

 

అనంతపురం సెంట్రల్‌: దేశ రక్షణకోసం సైనికులుగా వెళ్లిన వారంతా దాదాపు 20 సంవత్సరాలకు పైగా సరిహద్దులో..లేక మరో ప్రాంతంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కుటుంబానికి, ఈ ప్రాంతానికి దూరంగా బతుకుతారు. తిరిగి ఈ ప్రాంతానికి వచ్చినప్పడు అంతా కొత్తగా ఉంటుంది. పట్టణ రూపురేఖలన్నీ మారిపోయి ఉంటాయి. ఇదే అదునుగా కొంతమంది... మాజీ సైనికులను సైతం బెదిరించి భూములను కబ్జా చేస్తున్నారు. అందువల్లే అనేక మంది సైనికులకు ప్రభుత్వం భూములు కేటాయించినప్పటికీ అనుభవంలోకి వెళ్లలేకపోతున్నారు. పేరుకు ప్రభుత్వం మంజూరు చేశామని చెప్పినప్పటికీ ఆచరణలో వారికి స్వాధీనం చేయించలేకపోతుండడం అధికారుల అసమర్థతకు నిదర్శనంగా మారతోంది.

సైనికుల భూమిని ఆక్రమించినఓ ప్రజాప్రతినిధిరాజకీయాల్లో పెద్దమనిషిగా చెప్పుకుంటున్న ఓ ప్రజాప్రతినిధి ఏకంగా ముగ్గురు మాజీ సైనికుల భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నీతి, న్యాయమంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ నిత్యం నిలిచే సదరు నేత.. నియోజకవర్గ అధికారులను తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు. అందువల్లే దేశం కోసం శత్రువలతో పోరాడిన మాజీ సైనికులు కూడా ఆయన ముందు నోరుమెదపలేకపోతున్నారు. 

జూలై 26 1999. పాక్‌ దుశ్చర్యను తిప్పికొడుతూ దేశజవానులు వీరోచిత పోరాటం చేశారు. మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించారు. ఈ పోరాటంలో ఎంతోమంది వీరమరణం పొందారు. సైనికుల సేవలను కొనియాడుతూ ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్‌ దివస్‌ను ఘనంగా జరుపుకుంటాం. సైనికుల సేవలను మరోసారి స్మరించుకుంటాం. అయితే దేశం కోసమే శక్తినంతా ధారపోసి..పదవీ విరమణ పొందాక స్వగ్రామం చేరుకునే మాజీ సైనికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వారి సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఇచ్చిన భూములను, సొంత స్థలాలను కబ్జాలకు పాల్పడుతూ అవమానాలకు గురి చేస్తున్నారు. రెండురోజుల క్రితం నగరంలో బీఎస్‌ఎఫ్‌ జవాను నాగరాజుకు ఇదే అన్యాయం జరిగింది. భూ సమస్యలో ఇరుక్కోవడంతో పోలీసులు అతనికి ‘‘రిమాండ్‌ ఖైదీ’’ అనే బహుమానాన్ని  అందించారు.  

అమలుకాని కలెక్టర్‌ నిర్ణయాలు
2017 ఫిబ్రవరి 19న పీటీసీలో సైనిక సమ్మేళనం నిర్వహించగా.. రాయలసీమ జిల్లాలకు చెందిన వేలాది మంది మాజీ, ప్రస్తుత సైనికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వారందరీ సమక్షంలో అప్పటి కలెక్టర్‌ శశిధర్‌.. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి నెలలో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చకముందే ఆయన బదిలీ కావడంతో మాజీ సైనికుల గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. కొన్ని సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన సైనికులు తమ సమస్యలను పరిష్కరించుకోలేక ప్రభు త్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.  

న్యాయం చేయండి
మా ఆయన 20 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు. అందుకు గుర్తింపుగా ప్రభుత్వం రేగాటపల్లిలో సర్వే నంబర్‌ 381.2లో 4.90 ఎకరాలను మంజూరు చేసింది. భూమి సాగులో ఉన్నప్పటికీ అదే గ్రామానికి చెందిన కొంతమంది... రెవెన్యూ అధికారుల సహకారంతో అడంగల్‌లో పేర్లు మార్పు చేయించుకున్నారు. ఈ విషయంలో తెలిసి అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి మరెక్కడా లేదు.  – మాజీ సుబేదార్‌ ఆంజనేయులు భార్య శాంతకుమారి, రేగాటపల్లి, ధర్మవరం

కనీస గౌరవమివ్వరు
భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళితే కనీస గౌరవం లేకుండా అక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద మెకానిజం అవసరం లేదు. మమ్మల్ని సైనికులుగా గుర్తించి గౌరవ మర్యాదలతో మాట్లాడితే సగం సమస్యలు పరిష్కారమవుతాయి. చాలా మంది అధికారులు రాజకీయ నాయకులకే వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా సమస్యలు బయటకు చెప్పుకోలేక పోతున్నాం. దేశం కోసం పనిచేశామనే సంతృప్తి తప్ప..మాకు ఏం మిగలడం లేదు.    – కెప్టెన్‌ షేకన్న, మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు 

మరిన్ని వార్తలు