టీఆర్‌ఎస్ వైపు జయసుధ చూపు!

26 Jan, 2014 01:58 IST|Sakshi
టీఆర్‌ఎస్ వైపు జయసుధ చూపు!

మాజీ మంత్రి ద్వారా కేసీఆర్‌కు రాయబారం
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదన
 
 సాక్షి, హైదరాబాద్: సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యుడి ద్వారా ఆమె టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు ఈ మేరకు వర్తమానం పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థివర్గాలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం, గత ఎన్నికల సమయంలో ఉన్నట్టుగా పార్టీలో పెద్ద దిక్కు లేకపోవడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయని జయసుధ భావిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మాజీ మంత్రి ద్వారా కేసీఆర్‌కు రాయబారం పంపినట్లు తెలిసింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం టిక్కెట్ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం.
 
 మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో సెటిలర్లతో పాటు, మైనారిటీవర్గాలకు చెందిన ఓటర్లు కూడా గణనీయంగాఉండటం వల్ల గెలుపు అవకాశాలు ఉంటాయని జయసుధ వివరించినట్టు తెలిసింది. గత మూడు నాలుగు వారాలుగా ఈ ప్రతిపాదనపై మంతనాలు జరుగుతున్నా, చర్చలు ఒక కొలిక్కి రాలేదని తెలిసింది.

 

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్, జయసుధ ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. టీఆర్‌ఎస్ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. జయసుధను పార్టీలో చేర్చుకుంటే టీఆర్‌ఎస్‌కు చెందిన ఒక ఎంపీని చేర్చుకున్న కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పినట్టుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల్లో టీఆర్‌ఎస్‌కు బలం లేదన్న కారణంతో ఇక్కడ పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడంలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో జయసుధ వంటి ప్రముఖ వ్యక్తి పార్టీలో చేరితే తెలంగాణవ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
 

మరిన్ని వార్తలు