తిమ్మిని బమ్మిని 'జేసీ'.. 

8 Feb, 2020 04:12 IST|Sakshi

బీఎస్‌–3 లారీల కొనుగోళ్లలో జేసీ బ్రదర్స్‌ మాయాజాలం 

స్క్రాప్‌ కింద అశోక్‌ లేలాండ్‌ అమ్మిన వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న జేసీ 

పర్యావరణ పరంగా కాలం చెల్లిన 70 వాహనాలను తిప్పుతున్న వైనం 

రవాణా శాఖ విచారణలో బహిర్గతం.. 

క్రిమినల్‌ కేసుల నమోదుకు నిర్ణయం 

సాక్షి, అమరావతి: అక్రమ ‘మార్గాల్లో’ దోచేయడంలో టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్‌ను మించిన వారు లేరని మరోమారు నిరూపితమైంది. పర్మిట్లు లేకుండా బస్సులు తిప్పినా.. ఫోర్జరీ పత్రాలతో లారీలు, బస్సులను విక్రయించినా తమకు అడ్డే లేదన్నట్లు వ్యవహరించారు. ఈ అక్రమాలను మించి రవాణా శాఖ నివ్వెరపోయేలా మరో అక్రమ బాగోతం బయటపడింది. కాలం చెల్లిన అమ్మకూడని లారీలను తయారీ సంస్థ స్క్రాప్‌ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని దక్కించుకుని ఏకంగా నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవహారం రవాణా శాఖ విచారణలో తేలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 70 లారీలను ఇలా అక్రమ మార్గాల్లో తిప్పుతుండటంపై అధికార వర్గాలే నిర్ఘాంతపోతున్నాయి. నేషనల్‌ ఫ్రాడ్‌గా ఈ వ్యవహారాన్ని రవాణా శాఖ పేర్కొనడం గమనార్హం.    

సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేసి మరీ.. 
కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని బీఎస్‌–3 వాహనాలను నిషేధిస్తూ 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో వాహన కంపెనీలు ఆ వాహనాల అమ్మకాలను నిలిపేశాయి. 2017లో చంద్రబాబు జమానాలో జేసీ బ్రదర్స్‌ 70 బీఎస్‌–3 వాహనాలను దక్కించుకుని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. సాధారణంగా నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌ అంటేనే రవాణా శాఖకు అనుమానాలు తలెత్తాలి. కానీ అధికారం అండ ఉండటంతో అప్పట్లో రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో జేసీ బ్రదర్స్‌ ఆ కాలం చెల్లిన లారీలను అప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రోడ్లపై తిప్పుతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. లారీల ఛాసిస్, ఇంజన్‌ వివరాలను అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ప్రతినిధులకు మెయిల్‌ చేశారు.

ఈ లారీలను తాము స్క్రాప్‌ కింద అమ్మేశామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారుల బృందం కొన్ని రోజుల క్రితం నాగాలాండ్‌కు వెళ్లింది. నిషేధించిన లారీల రిజిస్ట్రేషన్‌కు జేసీ బ్రదర్స్‌ బినామీలు ఏ పత్రాలు సమర్పించారని అక్కడి రవాణా అధికారులను అడగ్గా, వారు కొన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు. వాటిని పరిశీలించిన రవాణా అధికారుల బృందం జేసీ బ్రదర్స్‌ నిషేధిత వాహనాలను తిప్పుతున్నారని నిర్ధారించింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వైనంపై క్రిమినల్‌ కేసుల్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ అక్రమ బాగోతంలో జేసీ బ్రదర్స్‌ బినామీ సంస్థ.. జటాధర ఇండస్ట్రీస్, జేసీ అనుచరుడు గోపాలరెడ్డి ఉన్నట్లు తేలింది. దీంతో 70 లారీలను సీజ్‌ చేయనున్నారు. వీటిలో 43 లారీలు అనంతపురం ప్రాంతంలో.. మరో 27 లారీలు బెంగళూరులో ఉన్నట్లు రవాణా అధికారులు గుర్తించారు.

ఫోర్జరీ పత్రాలతో రెండు బస్సుల విక్రయం 
నకిలీ పత్రాలతో, పోలీసుల ఫోర్జరీ సంతకాలతో నిరభ్యంతరాల పత్రాలు చూపి ఆరు లారీలను బెంగళూరులో విక్రయించిన వైనంపై అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు కేసులు నమోదు చేసి జేసీ ట్రావెల్స్‌ ఉద్యోగులు ఇద్దరిని గురువారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారమంతా దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం కనుసన్నల్లోనే సాగినట్టు వారిద్దరూ పోలీసుల విచారణలో వెల్లడించారు. లారీలనే కాకుండా రెండు బస్సులను కూడా ఇదే విధంగా అమ్మినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైనా కేసు నమోదు చేశారు. జేసీ బ్రదర్స్‌ అక్రమాలకు రవాణా శాఖలో కొందరు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఊతమిచ్చారన్న విమర్శలున్నాయి. వీరిపైనా చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు.  

మరిన్ని వార్తలు