జేసీ బ్రదర్స్‌ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం

12 Jun, 2020 07:54 IST|Sakshi
రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న బీఎస్‌–3 వాహనాలు

నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్‌ వాహనాల సీజ్‌లో మరో బాగోతం 

యజమానులకు సహకరిస్తున్న ఆర్టీఏ అధికారులు 

విడిభాగాలు తొలగించిన లారీలను సీజ్‌ చేస్తున్న అధికారులు

సాక్షి, అనంతపురం‌: బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌లు చేయించి అతి పెద్ద కుంభకోణానికి జేసీ సోదరులు పాల్పడ్డారు. ఈ అవినీతి బాగోతం రాష్ట్ర ఉన్నతాధికారులు బయటపెట్టారు. అయితే సదరు వాహనాలను సీజ్‌ చేయాల్సిన అధికారులు యజమానులతో కుమ్మక్కయ్యారు. విడిభాగాలు తొలగించుకున్న తర్వాత సీజ్‌ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలు అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. అప్పటికే ట్రావెల్స్‌ రంగంలో ఆరితేరిన జేసీ సోదరులు అతి తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి బీఎస్‌ 3 వాహనాలను కొనుగోలు చేశారు.

సుప్రీంకోర్టు బీఎస్‌3 వాహనాల విక్రయాలు రద్దు చేయాలని ఉత్తర్వులు వెలువడించిన తర్వాత షోరూంలలో నిలిచిపోయిన వాహనాలను కొనుగోలు చేశారు. అదికూడా నాగాలాండ్‌ రాష్ట్రంలో అశోక్‌లైలాండ్‌ కంపెనీ చెందిన దాదాపు 160 వాహనాలు కొనుగోలు చేశారు. ఈ తంతంగమంతా ఆలస్యంగా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌ కావడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సదరు వాహనాలన్నీ బీఎస్‌3 కాగా నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్‌4గా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఆర్టీఏ జాయింట్‌ కమిషనర్‌ జిల్లాకు వచ్చి మీడియా సమావేశంలో ధ్రువీకరించారు. ఇలా జిల్లాలో దాదాపు 80 వాహనాలున్నాయని గుర్తించారు. మిగిలినవి వివిధ జిల్లాలో తిరుగుతున్నట్లు తెలిపారు.  చదవండి: ‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్‌ చేయాలి’

యజమానులకు సహకరిస్తున్న ఆర్టీఏ ఉద్యోగులు  
దాదాపు నాలుగు నెలల క్రితం ఆర్టీఏ జాయింట్‌ కమిషనర్‌ జిల్లాకు వచ్చి జేసీ బ్రదర్స్‌ అవినీతి వ్యవహారం బయటపెట్టారు. సదరు వాహనాలను జప్తు చేయడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ జిల్లాలో అధికారులు మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు. ఇప్పటి వరకూ 50 వాహనాలు సీజ్‌ చేశారు. మిగిలిన 30 వాహనాలను గుర్తించాల్సి ఉంది. అయితే నాలుగు నెలల క్రితమే వాహనం నెంబర్‌తో సహా ఏఏ వాహనాలు అక్రమంగా రిజిస్ట్రర్‌ అయ్యాయో అధికారులు బహిర్గతపర్చారు. దాని ఆధారంగా యజమానులను సులభంగా గుర్తించవచ్చు. కానీ ఇక్కడి అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. పైగా యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  
వాహనాలను పట్టుకోవడంలో జాప్యం.. 

నాగాలాండ్‌లో కొనుగోలు చేసిన వాహనాలను కొన్నింటిని జేసీ ఉమారెడ్డి పేరుతో ఉండగా మరికొన్ని జఠాధర కంపెనీకి సి. గోపాల్‌రెడ్డితో ఉన్నాయి. వాహనాలను పట్టుకోవడంలో జాప్యం చేయడంతో అక్రమార్కులు ముందు జాగ్రత్తలు పడుతున్నారు. కొన్ని వాహనాలను ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టారు. మరికొన్నింటికి విడిబాగాలు తొలగించి విక్రయించేశారు. ఏకంగా టైర్ల వద్ద నుంచి బ్యాటరీలు, ఇంజన్, బాడీ మొత్తం తొలగించిన వాహనాలు కూడా ఉన్నాయి. కేవలం ఛాసీలు మాత్రమే ఉంటుండడంతో అవే వాహనాలను తీసుకొచ్చి ఆర్టీఏ కార్యాలయంలో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం ఇలా తొలగించడానికి వీల్లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆర్టీఏ ఉన్నతాధికారులు సదరు యజమానులపై సానుభూతి చూపిస్తుండడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్

మరిన్ని వార్తలు