జేసీ ట్రావెల్స్: అంతులేని అక్రమాలు..!

13 Jun, 2020 14:34 IST|Sakshi

సాక్షి, తాడిపత్రి: జేసీ బద్రర్స్‌కు చెందిన మోటార్‌ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో పలు దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తుక్కు కింద విక్రయించిన వాహనాలను సేకరించిన తాడిపత్రికి చెందిన జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ వాటికి నకిలీ పత్రాలు సృష్టించి 2018లో వాటిని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ 68 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్‌ లీలాండ్‌ కంపెనీకి మెయిల్‌ చేయగా, అన్ని అంశాలను పరిశీలించిన కంపెనీ అదే నెల 23న అంటే, ఈ ఏడాది జనవరి 23వ తేదీన పూర్తి వివరాలు పంపించింది. కాలం చెల్లిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్‌ లీలాండ్‌ కంపెనీ తెలిపింది. (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌)

ఆ కంపెనీలు ఎవరివి?:
జఠాధర ఇండస్ట్రీస్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డికి చెందింది కాగా, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్‌రెడ్డికి చెందింది.

పలు అశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి..
ఆ సమాచారం అందుకున్న తర్వాత రవాణా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా, ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించిన తర్వాత ఎన్‌ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించినట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి పూర్తి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల వివరాలు సేకరించగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. (జేసీ బ్రదర్స్‌ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం)

అక్రమాలు ఎలా?:
తమ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోరుతూ, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ తరపున జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జేసీ ఉమాదేవి దరఖాస్తుపై సంతకం చేశారు. ఆ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్‌ లీలాండ్‌ కంపెనీ ఇన్‌వాయిస్‌లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. అంతే కాకుండా అశోక్‌ లీలాండ్‌ కంపెనీ ఇచ్చిన ఇన్‌వాయిస్‌లను అసంపూర్తిగా సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్‌ పొందాయి. ఉత్తరాఖండ్‌లోని కళ్యాణ్‌పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్‌ లీలాండ్‌ కంపెనీలు ఆ ఇన్‌వాయిస్‌లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు. బీఎస్‌–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలను ఏప్రిల్‌ 1, 2017 నుంచి విక్రయించరాదని, అదే విధంగా ఆరోజు నుంచి వాటికి ఎక్కడా రిజిస్ట్రేషన్‌ చేయొద్దని సుప్రీంకోర్టు మార్చి 29, 2017న ఆదేశాలు జారీ చేసింది. బీఎస్‌–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలు ఒకవేళ మార్చి 31, 2017 నాటికి విక్రయించి ఉంటే, వాటి రిజిస్ట్రేషన్‌కు మాత్రం కోర్టు మినహాయింపు ఇచ్చింది.


అంతులేని అక్రమాలు:
ఈ నేపథ్యంలో పై రెండు కంపెనీలు యథేచ్ఛగా మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించాయని తేలింది. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు చూపి, ఎక్కడో సుదూరంలో ఉన్న నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అంతే కాకుండా కేవలం కొద్ది రోజుల్లోనే వాటికి ఎన్‌ఓసీ సంపాదించి, ఇక్కడ అనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సొంత జిల్లా కావడంతో యథేచ్ఛగా ఆ వాహనాలు తిప్పారు. ఆ విధంగా వారు చీటింగ్‌కు పాల్పడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, రహదారులపై తిరగడానికి ఏ మాత్రం అనువుగా లేని, తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించి జిల్లాలో తిప్పారు. రహదారి భద్రత లేకపోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యానికి కూడా కారకులయ్యారు. ఇంకా ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టారు.

పోలీసులకు ఫిర్యాదు:
వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం 1వ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేశారు. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలను నకిలీ, తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించడం, వాటికి ఎన్‌ఓసి పొంది 2 రోజుల నుంచి 2 వారాల్లోనే అనంతపురంలో తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం ఇంకా వాటిని యథేచ్ఛగా జిల్లాలోనూ, దేశంలోనూ తిప్పడం కచ్చితంగా చీటింగ్‌కు పాల్పడడమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేయడమే.

ఇంకా ఏమేం చేశారు?:
అంతే కాకుండా వాటిలో పలు వాహనాలను ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల విక్రయించాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీలపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే తుక్కు కింద బీఎస్‌–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ మరో 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది.

వాటికి కూడా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నాయంటూ, బీఎస్‌–4 ప్రమాణాలతో కూడి ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వాటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీ పేర్ల మీదే కాకుండా, కొన్ని వాహనాలను వ్యక్తిగత పేర్లతోనూ రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆయా వాహనాల ఛాసిస్‌ నెంబర్లను పరిశీలించగా, అన్నీ బీఎస్‌–3కు చెందినవే తప్ప, బీఎస్‌–4 ప్రమాణాలతో కూడినవి కావని తేలింది. ఇదే విషయాన్ని అశోక్‌ లీలాండ్‌ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధారించారు.  వాటన్నింటినీ బీఎస్‌–4 ప్రమాణాల వాహనాలుగా చూపడానికి నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించారు.

154 వాహనాల లావాదేవీల నిషేధం:
రాష్ట్రంలో 101 వాహనాలు రిజిస్టర్‌ అయి ఉండగా, వాటికి సంబంధించి మరే లావాదేవీ జరగకుండా డేటా బేస్‌ బ్లాక్‌ చేశారు. 28 వాహనాలను ఇప్పటికే ఎన్‌ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ఆ వాహనాలపై ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్‌ చేయాలని అధికారులు కోరారు. ఇంకా మిగిలిన వాహనాలను ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. 

రిజిస్ట్రేషన్ల రద్దు:
రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో 89 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. వాటిలో అనంతపురం జిల్లాలో 77 వాహనాలు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 5 చొప్పున, గుంటూరు జిల్లాలో మరో 2 వాహనాలు ఉన్నాయి. మిగిలిన వాహనాలకు సంబంధించి ఆర్‌సీ రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో 6 వాహనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. అందువల్ల వాటి ఆర్‌సీ రద్దు చేయాలంటే హైకోర్టు అనుమతి కావాలి. అందుకే అధికారులు వేచి చూస్తున్నారు. ఇంకా కడప జిల్లాలో 3 వాహనాలు, అనంతపురం జిల్లాలో మరో 3 వాహనాల ఆర్‌సీలు రద్దు చేయాల్సి ఉంది.

మొత్తం 154 వాహనాలకు సంబంధించి ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా ‘వాహన్‌’ డేటాబేస్‌లో వాటిని బ్లాక్‌ చేయమని కోరుతూ రవాణా శాఖ జాయింట్‌ సెక్రటరీకి లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్‌ అయిన ఆ వాహనాల ఆర్‌సీల రద్దు కోసం ఆయా రాష్ట్రాలను కోరాలని అధికారులు నిర్ణయించారు. ఆ వాహనాలు రహదారులపై కనిపిస్తే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులను ఏపీ అధికారులు కోరారు.

వాహనాల స్వాధీనం:
రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో ఇప్పటికే 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా మిగిలిన 41 వాహనాల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 46 వాహనాలను స్వాధీనం చేసుకోగా, కడప, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 14 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 

క్రిమినల్‌ కేసుల నమోదు:
ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో రవాణా అధికారి (డీటీసీ) 24 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అదే విధంగా కర్నూలు డీటీసీ మరో 3 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి చెందిన గోపాల్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి మంతనాలు:
తమ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పలువురితో జేసీ ప్రభాకర్‌రెడ్డి మంతనాలు జరిపి, వారితో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఒక్కో వాహనానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు తిరిగి ఇస్తానని, అందువల్ల తమపై ఫిర్యాదు చేయవద్దని 35 వాహనాల యజమానులను ఆయన కోరినట్లు సమాచారం. అందువల్లనే ఆయా వాహనాలకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.

నకిలీ ఇన్సూరెన్సు పాలసీలు:
నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్‌తోనే వారి అక్రమాలకు తెర పడలేదు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఇన్సూరెన్సు పత్రాలను కూడా వారు నకిలీవి ఆర్‌టీఏ అధికారులకు సమర్పించారు.

ఇంకా కేసులు ఫైల్‌ చేయాల్సి ఉంది!:
ఆ విధంగా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు యథేచ్ఛగా బేఖాతరు చేయడం, ఫిట్‌నెస్, రోడ్‌ సేఫ్టీ లేకున్నా ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి వాహనాలను యథేచ్ఛగా రహదారులపై తిప్పడమే కాకుండా, చివరకు ఇన్సూరెన్సు పత్రాలు కూడా నకిలీవి సమర్పించిన ఈ రెండు కంపెనీలపై ఇంకా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా