మాయజేసీ.. వైకుంఠపాళీ!

23 Jan, 2019 13:30 IST|Sakshi
18 మీటర్ల నుంచి 10 మీటర్లకు కుదించి నిర్మించిన రాంనగర్‌ ఇరుకు బ్రిడ్జి

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య నాలుగున్నరేళ్ల ఆధిపత్యపోరు

నగరంలో ఎక్కడా కనిపించని ప్రగతి

టీడీపీ హయాంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టూ మంజూరు చేయించని     ఎంపీ, ఎమ్మెల్యే

అభివృద్ధికి సంబంధించిన ప్రతీ         అంశంలో పరస్పర విమర్శలు

 తాజాగా రాంనగర్‌ బ్రిడ్జి విషయంలో రగులుతున్న చిచ్చు

అనంతపురం ఎమ్మెల్యే, ఎంపీ.. ఇద్దరూ ఇద్దరే! అభివృద్ధికి నువ్వంటే.. నువ్వే వ్యతిరేకమని పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. ఇరువురి ఆధిపత్యపోరుతో తీవ్రంగా     నష్టపోయింది మాత్రం నగర ప్రజలే. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులు మినహా ఇద్దరు నేతలు ఒక్క ప్రాజెక్టునూ కొత్తగా ప్రభుత్వంతో మంజూరు చేయించలేకపోయారు. పైగా పాత ప్రాజెక్టులు పూర్తవుతున్న తరుణంలో ఈ పనుల ‘క్రెడిట్‌’ను ఖాతాలో వేసుకునేందుకు ఎవరికి వారు రోడ్డెక్కుతున్నారు. నిజానికి ఇద్దరి మధ్య వివాదం ఎలా తలెత్తింది? ఇరువురి తీరుతో నాలుగున్నరేళ్లలో నగరానికి ఏస్థాయిలో నష్టం వాటిల్లిందనే     విషయాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ నేత రషీద్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి లలిత కళాపరిషత్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో టీడీపీకి వ్యతికరేకంగా పనిచేసిన రషీద్‌ను చేర్చుకోవడాన్ని జేసీ బ్రదర్స్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా సమావేశానికి వెళ్లి చేరికను అడ్డుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలకు తొలి బీజం ఇదే. ఆ తర్వాత ప్రతి అంశంలోనూ ఇరువురి సిఫార్సులను పరస్పరం వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు. పాతూరులో రోడ్ల విస్తరణ అంశం ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి తీసుకెళ్లింది. రోడ్ల విస్తరణను ఎమ్మెల్యే అడ్డుకోవడం, దానికి ప్రతిగా ‘స్వచ్ఛభారత్‌’ పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి బలప్రదర్శనకు దిగారు. ఇలా ప్రతి అంశాన్ని ఇద్దరూ వివాదం చేయడం మినహా ‘మా హయాంలో నగరానికి మేం ఫలానా ప్రాజెక్టు సాధించి పెట్టాం’ అని చెప్పుకునేందుకు ఇద్దరూ ఏమీ చేయలేకపోయారు.

తాజాగా రాంనగర్‌ బ్రిడ్జి వివాదం
రాంనగర్‌ రైల్వేబ్రిడ్జిని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో బ్రిడ్జి కోసం ఎమ్మెల్యే ఏం చేశారని ప్రారంభోత్సవంపైవ్యాఖ్యలు చేశారని, దాన్ని అడ్డుకునేందుకు యత్నించారని ఎంపీ ఘాటుగా స్పందించారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని, జేసీపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే కూడా తీవ్రంగానే స్పందించారు. ఇక బ్రిడ్జి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే వంతెన 2013లో మంజూరైంది. అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మంజూరు చేయించారు. ఈ పనులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. దీనికి ఇద్దరూ చేసిందేమీ లేదు. వీరు చేసిందల్లా బ్రిడ్జి వెడల్పు తగ్గించి ప్రజలను ఇబ్బంది పెట్టడమే. వంతెన నిర్మాణానికి 18 మీటర్లతో ప్రతిపాదనలు పంపగా.. బ్రిడ్జి వెడల్పును ఎమ్మెల్యే అడ్డుకుని 10 మీటర్లకే కుదించారనేది ఎంపీ వాదన. 18మీటర్ల మేర నిర్మిస్తే నాలుగు లైన్ల వంతెన పూర్తయ్యేది. అడ్డుకోవడంతో రెండు బస్సులు ఒకేసారి వెళ్లలేని విధంగా చిన్నవంతెన నిర్మించారు. ఎమ్మెల్యే అడ్డుపడినా, 18మీటర్లు నిర్మించకుండా.. కేవలం ఎలాగోలా బ్రిడ్జి పూర్తయితే చాలనే ధోరణిలో 10మీటర్లకు రాజీపడటం ఎంపీ చేసిన పెద్ద తప్పిదం. ఇద్దరి తీరుతో రాంనగర్‌ బ్రిడ్జి కుచించుకుపోయింది.

మంచినీటి పైపులైన్‌ కోసం రూ.138కోట్లు 2013 ఫిబ్రవరిలో మంజూరయ్యాయి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక టెండర్‌ రద్దు చేయించి, రీ టెండర్‌ పిలిపించి 5శాతం ఎక్కువకు టెండర్‌ వేయించి ఐహెచ్‌పీకి దక్కేలా చేశారు. ఈ పనులనూ తన ఖాతాలో వేసుకుంటున్నారు ఎమ్మెల్యే వైకుంఠం.
సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కూడా 2014కు ముందు అప్పటి     ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టే. అయినా నేనేనంటారు.
శిల్పారామానికి కూడా గత ప్రభుత్వ హయాంలోనూ రూ.5కోట్లు     మంజూరయ్యాయి. ఇదీ తన ఘనతేనంటారు.

ఏం‘జేసి’నా చెల్లుతుందనీ..
నగరాభివృద్ధికి కేటాయించిన ఎంపీ నిధులు స్వల్పమే.
రాజు రోడ్డు, సుభాష్‌రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య.
ప్లాస్టిక్‌ రద్దు మూడు రోజుల ముచ్చట.
నగరం గుంతలమయం. ఊసేలేని కొత్త రోడ్లు.
నాలుగున్నరేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడని అభివృద్ధి.
అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోనే నగరం ఉందనే సంగతి విస్మరించి రాజకీయం.

పూర్తి కాకుండానే ప్రారంభం
ఎన్‌టీఆర్‌ మార్గ్‌ను ప్రారంభిచామని ఎమ్మెల్యే, మేయర్‌ చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ రోడ్డే పూర్తి కాలేదు. పూర్తి కాకుండానే రోడ్డును ప్రారంభించిన ఘనత వీరికే చెల్లిందని ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు గుప్పిస్తాయి. పారిశుధ్య సమస్య నగరవాసులను తీవ్రంగా వేధిస్తోంది. అండర్‌గ్రౌండ్‌ వంతెనకు రూ.480కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 30శాతం నిధులను మంజూరు చేస్తే, కేంద్రం 70శాతం నిధులు విడుదల చేస్తోంది. నాలుగున్నరేళ్లలో ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేత ఆమోద ముద్ర వేయించలేకపోయారు. ఇకపోతే కంపోస్ట్‌యార్డుకు 10 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ నుంచి సాధించలేకపోయిన నేతల మాటలు ‘కోట్లు’ దాటుతుండటం చూసి జనం నవ్వుకుంటున్నారు.

రోడ్డు వెడల్పుతో భయభ్రాంతులు
పాతూరు రోడ్ల వెడల్పు అంశం ఇప్పటికీ వివాదమే. వెడల్పు చేయాలని ఎంపీ, వద్దని ఎమ్మెల్యే ప్రత్యక్ష యుద్ధమే చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఈ 57 నెలల కాలంలో చేసిందేమీ లేదు. అక్కడి వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేయడం తప్ప. ధర్మవరం, కళ్యాణదుర్గం, కదిరితో పాటు చాలా పట్టణాల్లో రోడ్ల విస్తరణ జరిగినా.. ఇంతలా ‘రాజకీయం’ చేసిన నేతలు వీరిద్దరే. అలాగే వంకల ఆధునికీకరణకు వైఎస్‌ హయాంలో రూ.39కోట్లు విడుదలయ్యాయి. ఇందులో నడిమివంక రక్షణ గోడ నిర్మించి, పూడిక తీశారు. అయితే మరువవంక పనులు మిగిలిపోయాయి. దీనికి సంబంధించి రూ.17కోట్ల నిధులు మిగిలి ఉంటే ఈ నిధులతో మరువవంక ఆధునికీకరణ విస్మరించి, చెరువు కట్టపై రోడ్డు నిర్మించారు. ఇప్పుడు తిరిగి అమృత్‌ ద్వారా మరువ వంకకు నిధులు తెస్తామని చెబుతున్నారు. ప్రభుత్వమే మరో రెండు నెలల్లో మారే పరిస్థితి ఉంటే నిధులెలా వస్తాయో ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలి

మరిన్ని వార్తలు