నీ యబ్బ.. చేతకాని నా కొడుకులు!

18 Sep, 2018 06:27 IST|Sakshi
డీఎస్పీ విజయ్‌కుమార్‌ వైపు చేయి చూపించి దూషిస్తున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

డీఎస్పీపై విరుచుకుపడ్డ ఎంపీ జేసీ

పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ఆయనో ఎంపీ. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేత సంయమనం కోల్పోయారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నా ధోరణి ఇంతే అన్నట్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ఒళ్లంతా కళ్లు చేసుకుని పహారా కాస్తున్నారు. మొదటి రోజు ఘటనలో తప్పులు ఎవరిదనే విషయం పక్కనపెడితే..

రెండవ రోజు ఎంపీ జేసీ రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ దుడుకు తనమే ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఇదంతా పక్కనపెడితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రబోధాశ్రమం ఘటనలో ఏకంగా పోలీసు వ్యవస్థే తాడిపత్రిలో తిష్టవేయాల్సి వచ్చింది. ఇంత చేసినా.. ఎంపీ హోదాలో ఓ డీఎస్పీ, అందునా ఎస్సీ ఉద్యోగిపై జేసీ చేసిన వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయనే చర్చ జరుగుతోంది.

అనంతపురం, తాడిపత్రి: ఏం పనయ్యా.. నీ సైన్యం అంతా.. నీయబ్బా.. చేతకాని నా కొడుకులు. మా మీద ప్రతాపం చూపిస్తారా! మీరు కనబడితే లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ మీరై మీరు క్రియేట్‌ చేసుకుంటారు.. నీయబ్బ దొంగ  (పత్రికలో రాయలేని భాష), చేతకానినా కొడుకులంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి ఇన్‌చార్జి డీఎస్పీ విజయ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. వందలాది మంది సమక్షంలో సోమవారం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌ వెలుపల తిట్ల దండకం అందుకున్నారు. పత్రికల్లో రాయడానికి వీలుకాని భాషను పోలీసులపై ఉపయోగించారు. పోలీసులను చేతకాని వాళ్లుగా తేల్చేశారు. నెట్టింట్లో జేసీ వ్యాఖ్యలు హల్‌చల్‌ చేస్తుండటంతో ఆ మాటలకు యావత్‌ పోలీసు యంత్రాగం విస్మయం చెందుతోంది.

మరిన్ని వార్తలు