పోలీసుల తీరుపై ఎంపీ జేసీ ఆగ్రహం

18 Sep, 2018 06:38 IST|Sakshi
నిరసన తెలుపుతున్న జేసీ దివాకర్‌రెడ్డి

అనంతపురం: ప్రబోధానంద ఆశ్రమం వద్ద జేసీ వర్గీయులకు, భక్తులకు మధ్య నెలకొన్న వివాదంపై తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రెండో రోజు సోమవారం కూడా తన అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. ఆశ్రమంలో ఉన్న వారిని అరెస్ట్‌ చేయాలని, లోపల జరుగుతున్న వాటిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గ్రామస్తులపై విచక్షణా రíహితంగా దాడి చేసిన ఆశ్రమ నిర్వాహకులను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆశ్రమం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయని, భక్తులను ఆశ్రమం నుంచి ఖాళీ చేయిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు ఎంపీకి నచ్చజెప్పారు. ఈ సమయంలో తాడిపత్రి డీఎస్పీ విజయ్‌కుమార్‌పై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

144 సెక్షన్, 30 యాక్ట్‌ ఉల్లంఘన
తాడిపత్రిలో 144 సెక్షన్, 30యాక్ట్‌ అమల్లో ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతూ పోలీస్‌స్టేషన్‌ వద్ద నిబంధనలకు విరుద్ధంగా జేసీ దివాకర్‌రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి హంగామా సృష్టించడం గమనార్హం. తాడిపత్రిలో చట్టాలు ఎలా అమలు అవుతాయి? కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఈ చట్టాలు వర్తిస్తాయి! అన్న విషయం ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. సాధారణ ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపించే పోలీసులు 30 యాక్ట్‌ అమలులో ఉన్న సమయంలో పోలీస్‌స్టేషన్‌ వద్ద పోలీసుల ముందే ఆ చట్టాన్ని అవహేళన చేస్తూ హంగామా చేస్తున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 144 సెక్షన్, 30 యాక్ట్‌ అమలులో ఉందని తెలిసినా పోలీస్‌స్టేషన్‌లోకి తన అనుచరులను అనుమతించాలని ఎంపీ ఆదేశించడం గమనార్హం. ఒక వైపు ఎవరూ నినాదాలు చేయరాదని సర్దిచెబుతూనే మరో వైపు తన అనుచరులను గుంపుగా తన చుట్టూ ఉంచుకుని చట్టాలను ఉల్లంఘించారు. ఆశ్రమంలో భక్తులను తరలిస్తున్నారని పోలీసులు తెలిపిన ఆనంతరం జేసీ జిందాబాద్, జై జేసీ అంటూ నినాదాలు చేస్తూ  అనుచరులు పోలీస్‌స్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు