-

ఎమ్మెల్యే జేసీ బూతు పురాణం

12 Sep, 2018 13:49 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మల్లికార్జున ఆచారి

షాపు ఖాళీచేయమని అడగడమే నేరం

దుకాణం యజమానితో అసభ్య పదజాలంతో ఫోన్‌ సంభాషణ

అనంతపురం రూరల్‌:
‘‘నమస్తే అన్నా.. నేను మల్లిని.. అనంతపురం ఉంచి ఫోన్‌ చేస్తున్నా..
చెప్పప్పా (ఎమ్మెల్యే జేసీ)..
అన్నా నా షాపన్నా.. ఇద్దరు కొడుకులన్నా (బాధితుడు)..
‘రేయ్‌ పగల... ఇస్తాను.. రేపు తీసుకో.. (జేసీ ఆగ్రహం).’’
అగ్రిమెంట్‌ గడువు ముగియడంతో దుకాణం అప్పజెప్పమని కోరిన బాధితునితో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అసభ్య పదజాలంతో జరిపిన ఫోన్‌ సంభాషణ ఇది.

దుకాణాన్ని ఖాళీ చేయాలని కోరడంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యం చేశారని అనంతపురంలోని అంబారపు వీధికి చెందిన మల్లికార్జున ఆచారీ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం భార్య రమాదేవి, కుమారులు ఓబుళాచారి, మంజునాథాచారితో కలిసి మల్లికార్జున తన గోడు చెప్పుకున్నారు. సుభాష్‌రోడ్డులోని నందిని హోటల్‌ ఎదురుగా తమకు వారసత్వంగా వచ్చిన షాపును 2000 సంవత్సరంలో బాబయ్య అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చామన్నారు. ఆ వ్యక్తి జేసీ బ్రదర్స్‌తో కలిసి కొన్నేళ్లుగా ‘జేసీ ట్రావెల్స్‌’ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడన్నారు.

అగ్రిమెంట్‌ గడువు ముగియడంతో షాపు ఖాళీ చేయాలని తాము కోరితే ఖాళీ చేయడంలేదన్నారు. ఫోన్‌లో ఎంత ప్రాధేయపడ్డా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వినకపోగా బండ బూతులు తిట్టారని ఫోన్‌ సంభాషణను విలేకరులకు వినిపించారు. ఇదే విషయాన్ని ఎస్పీ, డీఐజీ, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. నేరుగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిసి బతిమాలినా కనికరం చూపలేదన్నారు. షాపు వదిలేదే లేదు.. నీ ఇష్టమొచ్చింది చేసుకో అంటూ బండబూతులు తిడుతూ గెంటేశారని మల్లికార్జున ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణ భయంతో కోర్టును కూడా ఆశ్రయించలేకపోతున్నామని.. అధికారులు, పోలీసులు స్పందించి తమ షాపును తమకు ఇప్పించాలని ఆయన వేడుకున్నారు.

మరిన్ని వార్తలు