ఆస్పత్రిలో డ్యాన్సులపై ఆరా

22 Jan, 2020 13:16 IST|Sakshi
డ్యాన్సుల ఘటనపై విచారణ చేస్తున్న జేసీ–2 తేజ్‌భరత్‌

విచారణ అధికారిగా జేసీ–2 తేజ్‌ భరత్‌  

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించి ఐదేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 2న ఆస్పత్రి వైద్య అధికారులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, నర్సింగ్‌ విద్యార్థినులు, సిబ్బంది డ్యాన్సులతో హోరెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు డ్యాన్సుల ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌–2 నంబూరి తేజ్‌ భరత్‌ను నియమించారు.

ఆయన మంగళవారం ఉదయం ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో విచారణ చేపట్టారు. డ్యాన్సులు చేసిన హాలును, సమీపంలోని రోగుల వార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలు, వైద్యసేవలపైనా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినులనూ ఆరా తీశారు. ఆ రోజు ఏమి జరిగిందనే దానిపై క్షుణ్ణంగా విచారణ చేపడుతున్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన సిబ్బంది, అధికారులు, విద్యార్థినులు, రోగుల స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేస్తున్నారు.  ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ ముత్యాలరాజు విచారణకు ఆదేశించారని, ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, అందరినీ విచారించాల్సి ఉందని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు