కేంద్ర మంత్రి శీలంకు సమైక్య సెగ

23 Oct, 2013 02:53 IST|Sakshi

పాలకొల్లు టౌన్ / భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జేడీ శీలానికి ‘పశ్చిమ’లో సమైక్య సెగ తగలింది. వ్యక్తిగత పనిపై యలమంచిలి మండలానికి వస్తున్న ఆయన కాన్వాయ్‌ను మంగళవారం పాలకొల్లు, భీమవరంలలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. మంత్రి రాజీనామా చేయాలని, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పాలకొల్లు పట్టణం బ్రాడీపేట వద్ద అడ్డగించిన సమైక్యవాదులతో మంత్రి మాట్లాడుతూ ఇరుప్రాంతాల వారికి సమన్యాయం జరిగే విధంగా కేంద్రం ఆలోచన చేస్తుందని చెప్పారు. ఆందోళనలో వైసీపీ నాయకుడు ముచ్చర్ల శ్రీరామ్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకుడు కేఎస్‌పీఎన్ వర్మ, ఎన్జీవో సంఘ నాయకుడు గుడాల హరిబాబు, ఎం.మైఖేల్‌రాజు,  చందక సత్తిబాబు, గడే సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
 
 భీమవరంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు వత్సవాయి శ్రీనివాసరాజు, మంతెన కృష్ణంరాజు, వి.సుబ్బారావు, గంటా సుందర కుమార్, కఠారి వెంకటేశ్వరరావు, కలిదిండి గోపాలకృష్ణంరాజు మంత్రి కారును అడ్డుకున్నవారిలో ఉన్నారు.  యలమంచిలి : కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జేడీ శీలం తన సతీమణి సుజాత చేత స్టేట్ బ్యాంకులో ఖాతా ప్రారంభించేందుకు మంగళవారం యలమంచిలి వచ్చారు. సుజాతకు మండలంలోని ఆర్యపేటలో అమ్మమ్మ రాపాక అచ్చమ్మ, తాతాయ్య నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి ఉంది. దాని కౌలును బ్యాంకులో వేయించేందుకు వీలుగా బ్యాంకు ఖాతాను సుజాత ప్రారంభించారు.

మరిన్ని వార్తలు