ఆ డీసీటీవోకు లంచాల దాహం

5 May, 2015 01:39 IST|Sakshi
ఆ డీసీటీవోకు లంచాల దాహం

జ్యూయలరీ షాపు యజమాని నుంచి లంచం డిమాండ్
సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారుల దాడి, ఇంట్లో సోదాలు
ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు
 

విశాఖపట్నం : ఏసీబీ వలలో మరో బడా అధికారి చిక్కాడు. రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. జ్యూయలరీ షాప్ యజమాని శ్రీనివాసరావు నుంచి రూ.లక్షా 50 వేల లంచం తీసుకుంటుండగా ఉప వాణిజ్య పన్నుల అధికారి కమలారావును సోమవారం ఉద యం పట్టుకున్నారు. లంచం కేసే కాకుండా కమలారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతనికి ఐవోబీలో రెండు లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. లాకర్లు తెరిస్తేనే అతడి ఆస్తులు విలువ తేలుతుందని అధికారులు భావిస్తున్నారు. వాటిని తెరవడానికి సిద్ధమవుతున్నారు. నాలుగు రోజుల కిందటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన డి ప్యూటీ తహశీల్దారు ఇళ్లపై ఏసీబీ దాడులు   చేసింది. ఈ దాడుల్లో రూ.పది కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేశారు.

రూ.లక్షా 50 వేల డిమాండ్:  వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్-2 పరిధి వన్‌టౌన్‌లో శ్రీనివాస్ జ్యూయలరీ షాప్‌ను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ సర్కిల్ కార్యాలయం ఉప వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తున్న పి.కమలారావు ఫిబ్రవరిలో శ్రీనివాస జ్యూయలరీ షాప్‌పై దాడులు చేశారు. అప్పటి నుంచి ఎసెస్‌మెంట్స్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. అవి ఇవ్వాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని జ్యూయలరీ షాప్ యజమాని తెలపగా రూ.లక్షా 50 వేలు ఇవ్వడానికి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. ఈ మొత్తం సోమవారం ఉదయం అప్పుఘర్ కైలాసగిరి రోప్‌వే వద్ద ఉన్న తన నివాసానికి తీసుకురావాలని శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనల మేరకు నగదు తీసుకుని కమలారావు ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీనివాసరావు నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కమలారావును పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి అతడి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. స్థలాలు, నగదు, బంగారంతోపాటు బ్యాంక్ లాకర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు.

కమలారావుపై ఆరోపణలు:  సహ వాణిజ్య పన్నుల అధికారిగా ఉన్నప్పటి నుంచి కమలారావుపై ఆరోపణలున్నాయి. షెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వహించినప్పుడు లారీల యజమానుల వద్ద లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. లారీలు నిలిపి సోదాలు చేసిన విషయంలో ఓ పంజాబ్ లారీ డ్రైవర్ కమలారావును కొట్టి రూమ్‌లో బంధించడం అప్పట్లో రాద్దాంతమైంది. సిరిపురం డివిజన్ కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహించినప్పుడు మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు